కరోనా వైరస్ గాలి ద్వారా(Corona Airborne) వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ప్రస్తుతం పాటిస్తున్న ఆరు అడుగుల భౌతిక దూరం(Six Feet Distance) సరిపోదని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇళ్లలో వైరస్ వ్యాప్తిపై పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం 'సస్టెయినబుల్ సిటీస్ అండ్ సొసైటీ' జర్నల్‌లో ప్రచురితమైంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా సోకకుండా(Coronavirus Transmission) ఉండాలంటే ఎక్కువ భౌతిక దూరం పాటించడమే గాక.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. అలాగే సరైన వెంటిలేషన్ సదుపాయం కూడా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ అధ్యయనం చేపట్టిన పరిశోధకులు మూడు కారణాలను విశ్లేషించి ఈ నిర్ధరణకు వచ్చారు. వెంటిలేటర్ల ద్వారా గాలి వ్యాప్తి రేటు, భిన్న వెంటిలేటర్లున్నప్పుడు ఎయిర్‌ఫ్లో ఎలా ఉంటుంది? మనం శ్వాస తీసుకునే విధానం, మాట్లాడేటప్పుడు విడుదలయ్యే గాలి వంటి అంశాలను పరిశీలించారు.
ఓ భవనంలో కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు విడులయ్యే వైరస్ కణాలు.. రెండు మీటర్ల దూరంలో ఉన్న మాస్క్ ధరించని వ్యక్తి శ్వాస తీసుకునే ప్రదేశంలోకి చేరుతాయని పరిశోధకులు తెలిపారు. వెంటిలేషన్ సరిగ్గా లేని నివాసాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఎక్కువ దూరం పాటించడమే గాక, మాస్కు కూడా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'భారత్ వేదికగా తాలిబన్లపై అమెరికా గురి'- కాంగ్రెస్ ఫైర్!