అమెరికా సర్జన్ జనరల్ పదవికి భారతీయ అమెరికన్ వైద్యుడు వివేక్ మూర్తిని ఎంపిక చేస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని సెనేట్ ఆమోదించింది. 57-43 ఓట్ల తేడాతో ఆయన నియామకాన్ని సెనేటర్లు సమర్థించారు. ఏడుగురు రిపబ్లికన్లు సైతం మూర్తికి మద్దతుగా ఓటేశారు.
కరోనా సహా ప్రజారోగ్య విషయాల్లో అధ్యక్షుడికి సలహాదారుడిగా వ్యవహరించనున్నారు వివేక్. కరోనా కట్టడి దిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ఓసారి అమెరికా సర్జన్ జనరల్‌గా పనిచేశారు వివేక్.
సెనేట్‌లో తన ఎంపికపై మాట్లాడిన వివేక్.. గత ఏడాది కాలంగా దేశం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. వీటిని చక్కదిద్దేందుకు చట్టసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
ప్రస్తుతం బైడెన్ కొవిడ్-19 సలహా బృందంలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు వివేక్ మూర్తి. ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ చీఫ్‌గా నాలుగేళ్ల పాటు వ్యవహరించనున్నారు. ప్రస్తుత సర్జన్ జనరల్ జెరోమ్ అడమ్స్ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదీ చదవండి: 'భారత్-చైనా మధ్య తారస్థాయిలో విభేదాలు'