అమెరికాను కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న వేళ వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేశారు ఆ దేశ పరిశోధకులు. మొదటిసారి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సారి సాధారణ టీకా మాదిరిగా కాకుండా చర్మం లోపలికి ఇంజెక్ట్ చేసి పరీక్షించారు.
40 మందిపై..
ఈ వ్యాక్సిన్ ను ఇనావియో ఫార్మా సంస్థ రూపొందించింది. రెండు పరీక్ష డోసులను ఐఎన్ఓ-4800 కోడ్ తో 40 మంది ఆరోగ్యంగా ఉన్న వలంటీర్లపై ప్రయోగించింది. కన్సాస్ సిటీ పరిశోధన కేంద్రంలో ఈ ట్రయల్స్ నిర్వహించారు.
"మొదటి దశ ప్రయోగంలో ప్రాథమికంగా తీసుకునే భద్రత చర్యలు ఇవే. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మొదట యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయో అంచనా వేస్తాం. "
- డాక్టర్ జాన్ ఎర్విన్, ఔషధ పరిశోధన కేంద్రం
చైనా పరిశోధకులతో కలిసి ఇనావియో పనిచేస్తోంది. ఆ దేశంలోనూ త్వరలోనే వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
గత నెలలోనూ సియోటెల్లో అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్).. 45 మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించింది. ఆ ప్రయోగంలో వలంటీర్లపై ఎలాంటి దుష్ప్రభావం పడలేదు.
ఏడాది సమయం..
ఈ ప్రారంభ దశ ప్రయోగాలు.. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందకు ఉపయోగిస్తారు. భారీ సంఖ్యలో పరీక్షలకు సురక్షితమైనవేనా లేదా అనే అంచనా వేసుకుంటారు పరిశోధకులు. ఈ పరీక్షల ఫలితాలు సంతృప్తిని ఇస్తే వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేందుకు ఒక ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్ది వ్యాక్సిన్లను తయారు చేశారు. వాటిని మరికొన్ని రోజుల్లో పరీక్షించే అవకాశం ఉంది. అన్ని టీకాల లక్ష్యం.. వైరస్ ఉపరితలంపై ఉన్న ప్రొటీన్ ను అంతం చేయటమే. చాలా సంస్థలు వివిధ పద్ధతుల్లో వ్యాక్సిన్లను తయారు చేస్తాయి.
ఇలా పనిచేస్తుంది..
ఇనావియో పరిశోధకులు.. వైరస్ జన్యు సమాచారాన్ని సింథటిక్ డీఎన్ఏ రూపంలో పొందుపరిచారు. ఒక వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వగానే.. అతని శరీరంలో హాని చేయని ప్రొటీన్ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను విడుదల చేస్తాయి.