అన్ని రకాల కరోనా(Corona) వైరస్‌లపై పనిచేసే ఔషధాల తయారీ దిశగా కెనడా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వైరస్ ప్రొటీన్‌లలో కాలపరీక్షలకు తట్టుకొని నిలబడ్డ 'డ్రగ్ బైండింగ్ పాకెట్ల'ను వారు గుర్తించారు. వీటిని లక్ష్యంగా చేసుకుంటూ మందులను ప్రయోగించొచ్చని తెలిపారు. టీకాలను తట్టుకొని నిలబడే వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందువల్ల కరోనాలోని అన్ని రకాలపై పనిచేసే చికిత్సలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యంగా మారింది. 27 కరోనా వైరస్ జాతులు, కొవిడ్ బాధితుల నుంచి సేకరించిన వేల నమూనాల్లోని వైరల్ ప్రొటీన్లను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
అసలేంటీ ప్యాకెట్లు?
ప్రొటీన్లలోని కొన్ని భాగాల్లోకి ఔషధాలు చేరుతుంటాయి. తద్వారా ఆ ప్రొటీన్ పనితీరును దెబ్బతీస్తాయి. వీటిని 'డ్రగ్ బైండింగ్ పాకెట్లు'గా పేర్కొంటారు. వైరస్‌లు కొంతకాలానికి ఉత్పరివర్తన చెందుతాయి. ఫలితంగా ఆ ప్రొటీన్ భాగాల్లో ఔషధాలు ఇమడవు. ఇలాంటి భాగాల్లో కొన్ని మాత్రం ఆ ప్రొటీన్ పనితీరుకు అత్యవసరం. అవి ఎట్టిపరిస్థితుల్లోనూ మార్పులకు లోనుకావు.
కరోనా వైరస్‌తో లింక్
ప్రస్తుత కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్‌లోని 15 రకాల ప్రొటీన్లలో ఇలాంటి భాగాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్ అల్గోరిథమ్‌ను ఉపయోగించారు. 27 రకాల కరోనా జాతుల్లోనూ ఇలాంటి ప్రొటీన్లను పరిశీలించారు. వీటన్నింటిలోని ఎన్‌ఎస్‌పీ-12, ఎన్‌ఎస్‌పీ-13 అనే ప్రొటీన్లలో ఔషధాలను పట్టి ఉంచే భాగాలు మార్పులకు లోనుకాలేదని గుర్తించారు. వీటిని లక్ష్యంగా చేసుకొని ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Delta Variant: వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వ్యాప్తి!