Chewing Gum Covid: ఒమిక్రాన్ వెలుగుచూసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. కరోనా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
కొత్తగా కొవిడ్ వ్యాప్తి అడ్డుకట్ట వేసే ఓ చూయింగ్ గమ్‌ను ఆవిష్కరించారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా శాస్త్రజ్ఞులు. దీని ద్వారా శరీరంలోకి చేరే కరోనా వైరస్ లోడ్‌ను 95 శాతం తగ్గించవచ్చని చెబుతున్నారు. తద్వారా.. వైరస్ సంక్రమణకు అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు పరిశోధకులు హెన్రీ డేనియల్.
లాలాజలంలో కరోనా లోడ్ ఎక్కువ. దగ్గిన, తుమ్మినా నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తుంది. అందుకే ఈ లాలాజలంలోని వైరస్ లోడ్ తగ్గించడమే లక్ష్యంగా పరిశోధనలు చేశారు. ఏసీఈ2 అనే ప్రొటీన్‌తో చూయింగ్ గమ్ తయారుచేశారు. వైరస్‌కు ఉచ్చులా పనిచేసే ఈ ప్రొటీన్‌లోని గ్రాహకాలకు లాలాజలంలోని వైరస్ అతుక్కుపోతుందని.. అప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కోల్పోతుందని పరిశోధకులు వివరించారు.
తొలుత.. కరోనా సోకిన బాధితుల నమూనాలు సేకరించి ప్రయోగాలు చేశారు. మాలిక్యులర్ థెరఫీ జర్నల్‌లో ఈ అధ్యయనం సంబంధిత కథనాలు ప్రచురితమయ్యాయి. వైరస్ నుంచి బాధితుల్ని కాపాడేందుకు ప్రొటీన్‌ను ఉపయోగించడం సులభమైన పద్ధతి అని, దాన్నే చూయింగ్ గమ్‌లో ఉపయోగించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ చూయింగ్ గమ్‌పై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్.. డెల్టా కంటే డేంజర్ ఏం కాదు!'