పారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా .. ఐక్యరాజ్యసమితికి అధికారిక లేఖ రాసింది. 200 దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందం అగ్రరాజ్యానికి నష్టం చేకూరుస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే.. అమెరికా నిర్ణయంపై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం.. వాతావరణ ఒప్పందంపై బాధ్యతాయుతంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఒప్పందాన్ని బలహీనపరుస్తుంది..
పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలనే నిర్ణయంపై విమర్శలు చేసింది రష్యా. అమెరికా చర్య 200 దేశాలు సమ్మతించిన ఒప్పందాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొంది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశాలలో అమెరికా మొదటి వరుసలో ఉంటుందని పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్. అగ్రరాజ్య నిర్ణయం ఒప్పందాన్ని అత్యంత తీవ్రమైన రీతిలో బలహీనం చేస్తుందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా లేకుండా.. ఎలాంటి వాతావరణ ఒప్పందం గురించి అయిన మాట్లాడటం కష్టమని తెలిపారు.
మరింత బాధ్యతగా..
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని ముందే ఊహించినట్లు తెలిపింది చైనా. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసింది. ప్రతికూల ప్రభావం కల్పించడానికి బదులుగా.. అమెరికా మరింత బాధ్యత వహించగలదని, బహుపాక్షిక సహకార ప్రక్రియకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు.
వాతావరణ మార్పు అనేది మానవాళి అందరూ ఎదుర్కొంటున్న సాధారణ సవాలుగా పేర్కొంది చైనా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మెక్రాన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ల భేటీలో వాతావరణ మార్పులపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది చైనా.
ఇదీ చూడండి: రండి.. సంతకం చేయండి: జిన్పింగ్కు ట్రంప్ లేఖ