iphone 14 Pro Max Explodes: స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉలిక్కిపడే ఓ ఘటన చైనాలో జరిగింది. చైనాలోని షాంగ్సీలో యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ పేలుడు ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయాలపాలైంది. ఈ ఘటన మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూడొచ్చు. బ్యాటరీ సమస్య కారణంగానే ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు అంతా భావిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?:
- నివేదికల ప్రకారం.. మహిళ నిద్రపోయే ముందు ఐఫోన్‌ను ఛార్జ్ చేసి ఉంచింది.
- రాత్రి నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌పై చేయి వేసింది.
- ఆ తర్వాత ఐఫోన్‌లో మంటలు చెలరేగి పేలిపోయింది.
- దీంతో నిద్రలేచి పొగ, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఫోన్ పూర్తిగా కాలిపోయింది.
- ఈ ఘటనతో చాలా నష్టం వాటిల్లింది. ఆమె నిద్రించిన బెడ్ కాలిపోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌లోని గోడలు పొగతో పూర్తిగా నల్లగా మారిపోయాయి.
- ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. బాధితురాలు ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను 2022లో కొనుగోలు చేసింది.
- దీని వారంటీ గడువు కూడా ముగిసింది.
- ప్రాథమిక నివేదికల ప్రకారం.. బ్యాటరీలో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
- మహిళ నివసించే అద్దె ఇల్లు డ్యామేజ్ అవ్వడంతో పరిహారం చెల్లించాలని యజమాని కోరుతున్నారు.
ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా స్మార్ట్ఫోన్లను ఎక్కువ సేపు ఛార్జింగ్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ పేలడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా చాలానే జరిగాయి. దీంతో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కంపెనీ అందించిన ఛార్జర్, బ్యాటరీ యూనిట్‌ను మాత్రమే ఉపయోగించాలంటున్నారు.
iPhone 14 Pro Max apparently exploded while charging,
— choqao (@choqao) November 4, 2024
causing severe burns!#Apple pic.twitter.com/lQ8EG0vP2B
యాపిల్ కంపెనీ ఏం అంటోందంటే..?: ఈ వార్త చైనా వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దీనిపై యాపిల్ కంపెనీ స్పందించింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన కంపెనీ ఐఫోన్ పేలుడుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు డివైజ్‌ను సమీపంలోని యాపిల్ కస్టమర్ కేర్‌కు తరలించింది. అయితే ఈ మొబైల్‌లోని బ్యాటరీ ఒరిజినల్‌గా ఉందా లేదా రిపేర్ సమయంలో మార్చారో ఇంకా తెలియరాలేదు.
హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్- 2 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడినా నో ఫికర్!