PM Vidyalaxmi Scheme BenefIts : ఉన్నత విద్య అభ్యసించాలని తపన ఉన్నప్పటికీ, చాలా మంది తెలివైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువులకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎలాంటి హామీ లేకుండా విద్యా రుణాలు ఇస్తోంది. ఇప్పటి వరకు వడ్డీ రహితంగా రూ.4.5 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు వడ్డీ రాయితీతో రూ.10 లక్షల వరకు రుణాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మధ్యతరగతి విద్యార్థులు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వీలవుతుందని భావిస్తోంది.
" congratulations to our youth on the approval of the 'pm vidyalakshmi' scheme in the union cabinet today, removing a major obstacle on their path to success. by envisioning a guarantee-free and collateral-free educational loan scheme, modi ji has ensured that no student is… pic.twitter.com/pog7s1LnD9
— Press Trust of India (@PTI_News) November 6, 2024
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ బెనిఫిట్స్
- ఈ విద్యాలక్ష్మి పథకం కింద 'ఎలాంటి తాకట్టు, హామీ లేకుండా' విద్యారుణాలు అందిస్తారు.
- ఏటా గరిష్ఠంగా ఒక లక్ష మంది విద్యార్థులకు ఈ పథకం కింద విద్యా రుణాలు అందేలా చూస్తారు.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న విద్యార్థులు రూ.10 లక్షల వరకు విద్యారుణాలు పొందవచ్చు.
- వాస్తవానికి రూ.4.5 లక్షల వరకు పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తారు. ఆ తరువాత ఎంత మొత్తం రుణం ఉన్నా, దానిపై విధించే వడ్డీలో 3 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఆడపిల్లలకు అదనపు రాయితీ కూడా కల్పిస్తారు.
- మంచి ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
- ఉన్నత విద్యా శాఖ ప్రతి సంవత్సరం అత్యంత నాణ్యమైన విద్యాసంస్థల జాబితాను సిద్ధం చేస్తూ ఉంటుంది. టాప్-100 ర్యాంక్‌ల్లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి పథకం కింద లోన్స్ అందిస్తారు. అలాగే రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని టాప్-200 ర్యాంక్‌ల్లో ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కూడా ఈ పథకం కింద విద్యా రుణాలు పొందడానికి వీలుంటుంది.
- ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా, సీఏ, ప్రొఫెషనల్ కోర్స్‌లు, ఐఐఎం, మేనేజ్మెంట్, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు మొదలైనవ రంగాలకు చెందిన కోర్సులు చదివే విద్యార్థులకు ఈ పథకం కింద ఎడ్యుకేషన్ లోన్ అందిస్తారు.
- అర్హులైన విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌లో ఈ రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు.
- అర్హత ఉన్న విద్యార్థులకు కేవలం 15 రోజుల్లోపే విద్యారుణం మంజూరు చేస్తారు.
- ఒక వేళ రుణాలు తీర్చలేక డిఫాల్ట్ అయితే 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీ కూడా అందిస్తారు.
విద్యాలక్ష్మి రుణాల కోసం అప్లై చేయండిలా!
- ముందుగా మీరు విద్యాలక్ష్మి పోర్టల్ ఓపెన్ చేయాలి.
- మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఎడ్యుకేషన్ లోన్ ఫారమ్ ఓపెన్ చేసి, మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు, మీ ర్యాంక్ వివరాలు నమోదు చేయాలి. తరువాత
- అందుబాటులో ఉన్న రుణ పథకాలు, వాటిని అందించే బ్యాంకుల వివరాలు చూడాలి.
- మీకు అనువైన రుణ పథకాన్ని, బ్యాంకును ఎంచుకోవాలి. గరిష్ఠంగా ఒకేసారి 3 బ్యాంకులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
- బ్యాంకులు మీ దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే, 15 రోజుల్లోగా మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాయి.
- ఒక వేళ మీ దరఖాస్తును తిరస్కరిస్తే, అందుకు తగిన కారణాలను తెలుపుతూ మీకు మెయిల్ పంపిస్తాయి.
నోట్ : ఈ విద్యారుణాలపై విధించే వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ మీరు ఈ రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తారా? లేదా మారటోరియం పద్ధతి ద్వారా ఉద్యోగంలో చేరిన తరువాత చెల్లిస్తారా? అనేది ముందుగా చెప్పాల్సి ఉంటుంది.