అమెరికా అధ్యక్షులు పదవిని వీడే ముందు నూతన అధ్యక్షులకు స్వహస్తాలతో లేఖ రాయడం గత కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ వీడ్కోలు లేఖల సంప్రదాయం 1989లో ప్రారంభమైంది. అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ శ్వేతసౌధాన్ని వీడే ముందు నూతన అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్‌కు లేఖ రాశారు.
హాస్యరచయిత సాండ్రా బాయింటన్ రూపొందించిన కార్టూన్‌ను ఉపయోగించి బుష్‌కు తన సందేశాన్ని రాశారు రీగన్. అందులో 'డోంట్ లెట్ ద టర్కీస్ గెట్ యు డౌన్'(మీరంటే గిట్టని వాళ్లు మీ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తపడండి) అనే మాట కూడా ఉంది.
"ప్రియమైన జార్జ్ మీకు ఓ సందర్భంలోనైనా అవసరం వచ్చినప్పుడు ఈ సామగ్రిని ఉపయోగించుకోవచ్చు. మనం పంచుకున్న జ్ఞాపకాలు, గురువారం భోజనాలు నేను మిస్ అవుతా." అని వీడ్కోలు లేఖలో రీగన్ రాశారు.
ట్రంప్ స్వస్తి?
అయితే అధ్యక్షులు పదవి వీడే ముందు రాసే ఈ లేఖల సంప్రదాయానికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వస్తి పలికేలా ఉన్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆయన అంగీకరించలేదు. జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరుకానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో 32 ఏళ్లుగా ఉన్న ఆనవాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. బైడెన్‌కు ఆయన లేఖ రాసే సూచనలే కనిపించడం లేదు.
1992లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్ క్లింటన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ రీగన్ మొదలు పెట్టిన సంప్రదాయాన్ని జార్జ్ హెజ్డబ్ల్యూ బుష్ కొనసాగించారు. తన స్వహస్తాలతో క్లింటన్‌కు వీడ్కోలు లేఖ రాశారు.
"నాలుగేళ్ల క్రితం ఈ కార్యాలయంలో అడుగుపెట్టినప్పుడు ఎంతటి ఆశ్చర్యం, గౌరవం పొందానో ఇప్పుడు కూడా అదే అనుభూతిని పొందుతున్నా. మీరు కూడా అదే అనుభూతి, సంతోషాన్ని పొందాలని ఆశిస్తున్నా. కొందరు అధ్యక్షులు చెప్పినట్లు ఇక్కడ నేను ఒంటరిగా ఉంటున్నా అనే భావన ఎప్పుడూ కలగలేదు. నేను సలహాలు ఇచ్చేందుకు మంచి వ్యక్తిని కాను. కానీ విమర్శకులను మిమ్మల్ని నిరుత్సాహ పరచడానికి, మీ విధులను అడ్డుకోవడానికి అనుమతించకండి. ఇప్పుడు మీ విజయమే దేశ ప్రజల విజయం. " అని బుష్ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని బుష్ తన పుస్తకం ' ఆల్ ద బెస్ట్, జార్జ్ బుష్: మై లైఫ్ ఇన్ లెటర్స్ అండ్ అదర్ థింగ్స్'లో ప్రస్తావించారు.
హిల్లరీ కంటతడి..
బుష్ లేఖ మనసును తాకేలా ఉందని బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ఒకానొక సందర్భంలో చెప్పారు. ఆ లేఖ చదివి కంటతడి పెట్టినట్లు వెల్లడించారు.
2000 సంవత్సరంలో బుష్ కుమారుడు జార్జ్ డబ్లూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు జూనియర్ బుష్‌కు స్వహస్తాలతో లేఖ రాశారు క్లింటన్. ' ఇప్పుడు మీ భుజాలపై మోసే భారం గొప్పది. నమ్మింది చేయడంలో ఉన్న ఆనందం అనిర్వచనీయం' అని పేర్కొన్నారు.
అ తర్వాత 2008లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామాకు జార్జ్ డబ్లూ బుష్ వీడ్కోలు లేఖ రాశారు. ' విమర్శకులు విరుచుకుపడతారు, నీ స్నేహితులు నిరుత్సాహ పరుస్తారు. ఏది ఏమైనా సరే నీవు ముందుకు నడిపే ప్రజలే ఇప్పుడు నీలో స్ఫూర్తి నింపుతారు' అని పేర్కొన్నారు.
2017లో ఒబామా పదవిని వీడే ముందు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వహస్తాలతో లేఖ రాశారు. "ఇది చాలా ప్రత్యేకమైన కార్యాలయం. ఇక్కడ విజయాలకు స్పష్టమైన నమూనా ఏమీ ఉండదు. నేను ఇచ్చే సలహా మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు." అని లేఖలో రాశారు.
అయితే ఒబామా రాసిన వీడ్కోలు లేఖలో ట్రంప్ ప్రస్తుత పరిస్థితులకు సరితూగే కొన్ని విషయాలున్నాయి.
"ఈ కార్యాలయంలో మనం తాత్కాలికంగానే ఉంటాం. ప్రజాస్వామ్య సంస్థలు, సంప్రదాయాలను మనం కాపాడాలి. చట్ట నియమాలు , పౌరుల స్వేచ్ఛకు రక్షణ, అధికారాల విభజన వంటి వాటి కోసం మన పూర్వీకులు పోరాడారు. వాటిని మనం కొనసాగించాలి. " అని ఒబామా లేఖలో పేర్కొన్నారు.