కరోనా నుంచి కోలుకున్నవారు కేవలం ఒక్క డోసు మోడెర్నా లేదా ఫైజర్ టీకా తీసుకుంటే సరిపోతుందని అమెరికా శాస్త్రవేత్తలు సూచించారు. వైరస్ నుంచి కోలుకున్న కొందరిపై సర్వే చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇంతవరకు కరోనా బారిన పడకుండా టీకా రెండు డోసులు తీసుకున్నవారికంటే, కొవిడ్ నుంచి కోలుకుని ఒక్క డోసు తీసుకున్నవారిలో యాంటీబాడీలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకున్న వారిలో ఇదివరకే యాంటీబాడీలు నిల్వ ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు.
మరో సర్వే
వైరస్ నుంచి కోలుకుని మోడెర్నా, లేదా ఫైజర్ టీకా సింగిల్ డోస్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలలో యాంటీబాడీలు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి మరో బృందం సర్వే చేసింది. ఒక్క డోసు టీకా తీసుకున్నవారిలో.. వారంలో రోజుల్లోనే యాంటీబాడీల సంఖ్య విపరీతంగా పెరిగిందని, 14 రోజుల్లో మరింత వృద్ధి చెందిందని పేర్కొంది. ఇంతవరకు కరోనా సోకకుండా ఉండి సింగిల్ డోసు టీకా తీసుకున్న వారిలో ఈ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తికాలేదని వెల్లడించింది.
ఈ రెండు సర్వేలపై యూకేకు చెందిన అంటువ్యాధుల, వ్యాధి నిరోధకశక్తి విభాగం ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఇలియాన్ రీలే స్పందించారు.
"ఈ రెండు సర్వేలు మంచి భరోసాను కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక్క డోసుకే యాంటీబాడీలు విపరీతంగా పెరగడం మంచి పరిణామం. కానీ ఇప్పటికే ప్రభుత్వాలు రెండు డోసుల టీకాను అందరికీ ఇస్తున్నాయి. ఈ సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు ఇవ్వాలని చెప్పడం కొంత గందరగోళానికి దారితీస్తుంది. అందరూ రెండు డోసుల టీకా తీసుకోవడమే మంచిదని నా అభిప్రాయం."
-ప్రొఫెసర్ ఇలియాన్ రీలే, అంటువ్యాధుల, వ్యాధినిరోధకశక్తి విభాగం, ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం
సర్వేలో పేర్కొన్నదంతా ప్రాథమిక సమాచారమేనని, ఇంకా దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు తెలిపారు.
ఇదీ చూడండి: 'రీఇన్ఫెక్షన్ను ఎదుర్కొనేలా ఇమ్యూనిటీలో మార్పులు'