భారత్, దక్షిణ అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో కొవిడ్ మహమ్మారి ఉద్ధృతితో ఊపిరి తీసుకునేందుకు ఆయా దేశాల ప్రజలు ఇబ్బంది పడిన ఘటనలు సాక్షాత్కారమయ్యాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహమ్మారి ఇంకా మనతోనే ఉందనడానికి ఓ హెచ్చరిక అని పేర్కొన్నారు. గ్లోబల్ హెల్త్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మహమ్మారి విజృంభణపై ఆయా దేశాలను హెచ్చరించారు.
"కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి... ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేవరకు ఓ ఒక్కరూ సురక్షితంగా లేనట్టేనని నేను చెబుతూనే ఉన్నాను. వ్యాక్సిన్లు, పరీక్షలు, ఔషధాలు, ఆక్సిజన్ వంటి వాటిల్లో అసమానతల వల్ల వైరస్‌కు పేద దేశాలు బలవుతున్నాయి. మనం ఇప్పుడు వైరస్‌తో పోరాడుతున్నాం. అదే సమయంలో.. ఆర్థిక యుద్ధ నియమాలపైనా మనం ఆయుధాలతో పోరాడాల్సి ఉంటుంది. ఇది వ్యాక్సిన్లకు వర్తిస్తుంది. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే ఇతర విషయాలకూ వర్తిస్తుంది."
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
'కొవాక్స్' కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 170 మిలియన్ల డోసులను పంపిణీ చేయాల్సి ఉండేదని గుటెరస్ అన్నారు. కానీ, పరిమిత టీకా ఉత్పత్తి, నిధుల కొరత, టీకా జాతీయవాదం వల్ల.. 65 మిలియన్ డోసులు మాత్రమే పంపిణీ జరిగిందని చెప్పారు. జీ 20 దేశాలు ముందుకు వచ్చి టీకా ఉత్పత్తికి నిధులు అందించాలని కోరారు. వందల కోట్ల రూపాయాల పెట్టుడుల ద్వారా.. వేల కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన టీకా డోసుల్లో 82 శాతం.. ధనిక దేశాలకే అందాయని, పేద దేశాలకు 0.3 శాతం టీకాలు మాత్రమే అందాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'భారత్‌లో విలయం.. ఆ దేశాలకు హెచ్చరిక'
ఇదీ చూడండి: భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా