Putin assets in US: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడుల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అంగీకారం తెలిపింది. అమెరికాలో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఈయూ కూడా ఆమోదించింది. యూరప్ దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది.
రష్యాను సస్పెండ్ చేసిన ఐరోపా కౌన్సిల్..
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో యూరోప్‌లోని మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరోపా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్లో 47 దేశాలు ఉన్నాయి.
మరోవైపు.. రష్యా చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. రష్యాపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నియంత్రిస్తున్నాయి.
రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను జపాన్ నిలిపివేసింది. ఇతర కఠిన ఆంక్షలను విధించింది. ఈ క్రమంలోనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి'.. ఉక్రెయిన్ సైన్యానికి పుతిన్ పిలుపు