కరోనా సంక్షోభం అనంతరం ప్రజలకు ఉద్యోగాలు లభిస్తున్నాయని, స్టాక్ మార్కెట్లు లాభాలవైపు పరుగులు పెడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫలితంగా భారీ స్థాయిలో పునరాగమనం చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని వ్యాఖ్యానించారు.
"భారీ స్థాయిలో పునరాగమనం చేసేందుకు మేము సిద్ధమవుతున్నాము. చాలా విధాలుగా అమెరికా మెరుగైన స్థితిలో ఉంది. స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఫెడరల్ రిజర్వ్ నుంచి కూడా మంచి వార్త లభించింది. ఆర్థికంగా పునరాగమనం చేస్తున్నాం. ఉద్యోగాల సంఖ్య అద్భుతంగా ఉంది. రానున్న వారాల్లో ఇంకా మెరుగుపడుతుంది."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఆర్థికపరంగా వచ్చే ఏడాది అమెరికా ఉన్నత శిఖరాలకు చేరే అవకాశముందని అభిప్రాయపడ్డారు ట్రంప్.
ఎన్నికల ర్యాలీలకు సిద్ధం...
కరోనా మహమ్మారి వల్ల మూడు నెలలపాటు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనలేదు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటం వల్ల తిరిగి రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారు ట్రంప్. ఓక్లహోమా నుంచి తన ఎన్నికల ర్యాలీని తిరిగి ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత టెక్సాస్, ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర కరోలినాలో ప్రచారాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు జో బిడెన్. ట్రంప్ కన్నా బిడెన్ ముందంజలో ఉన్నాయని పలు పోల్స్ సూచిస్తున్నాయి.