అమెరికా పోలీసుల తొందరపాటు చర్య మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో హింసాత్మక ఘటనలకు దారితీసింది. సోమవారం సాయంత్రం(స్థానిక కాలమానం ప్రకారం) పోలీసులు పది రౌండ్లకుపైగా కాల్పులు జరపటం వల్ల వాల్టర్ వాలెస్ అనే 27 ఏళ్ల ఆఫ్రో-అమెరికన్ యువకుడు మృతి చెందాడు. నిందితుడి చేతిలో కత్తి ఉందని, తాము వారిస్తున్నా దానిని కిందకు పడవేయకుండా తమ వైపే వస్తుండడం వల్ల కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.
అయితే, వాల్టర్ మానసిక పరిస్థితి బాగాలేదని, అతనిపై పోలీసులు అన్ని రౌండ్లు జరపాల్సింది కాదని మృతుడి తండ్రి ఆరోపించారు. ఘటన సమయంలో వాల్టర్ తల్లి కూడా అతనికి సమీపంలోనే ఉంది. పాదచారులు తీసిన వీడియోలోనూ పోలీసులు అవసరమైన దానికంటే అధికంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది.