అమెరికా పర్యటనలో ఉన్న(Modi Us Visit 2021) భారత ప్రధాని మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో(Kamala Harris) భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దైపాక్షిక అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా(Modi Us Visit 2021) కమలా హారిస్‌ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.



"అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకం. ప్రపంచానికి కమలా హారిస్ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని ఆశిస్తున్నాను. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుంది."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
భారత్ ప్రత్యేక భాగస్వామి..
భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతి ఉపాధ్యక్షరాలిగా చరిత్ర సృష్టించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అని కమలా హారిస్ పేర్కొన్నారు. టీకా ఎగుమతుల పునురుద్ధరణపై భారత్ ప్రకటనను కమలా హారిస్ స్వాగతించారు.

"కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉంది. కరోనా ఉద్ధృతిలో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉంది. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నారు. విదేశాలకు మళ్లీ టీకాలు ఎగుమతి చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమైన విషయం."
-కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని కమలా హారిస్ అన్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత భారత్, అమెరికాలపై ఉందని పేర్కొన్నారు.
నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు ప్రధాని ఐదు దిగ్గజ కంపెనీలు అయిన క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్‌స్టోన్ సీఈవోలతో చర్చలు నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌తో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ- కీలక అంశాలపై చర్చ