అమెరికాలో హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతి విధానం కొనసాగడంపై సందిగ్ధం వీడలేదు. ఇంకా అధికారిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున... రద్దుకు మరింత సమయం పడుతుందని ట్రంప్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు తెలిపారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే వీసాలు అన్నింటిపైనా సమీక్షిస్తున్నట్లు వివరించారు.
ట్రంప్ సర్కారు ప్రకటించినట్లు ఈ విధానం రద్దయితే 90 వేల మందికిపైగా హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములపై ప్రభావం పడనుంది. వీరిలో భారతీయ మహిళలే అధికం.
అసలేంటీ హెచ్-4?
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు హెచ్4-ఈఏడీ నిబంధనతో అనుమతి లభిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో తెచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉద్యోగ అనుమతి విధానం రద్దుపై త్వరలో ప్రకటన వెలువడనుందని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. కానీ... ఆ ప్రక్రియను గత రెండేళ్లలో అనేక సార్లు వాయిదా వేసింది. ఇప్పుడు మరోమారు అలాంటి ప్రకటనే చేసి... వేలాది మంది భారతీయుల్లో ఉత్కంఠను కొనసాగిస్తోంది.
ఇదీ చూడండి: 'జనాభాలో చైనాను దాటేయనున్న భారత్'