భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తప్పుపట్టింది. జాదవ్ నిర్బంధం పూర్తిగా అక్రమమని.. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఐసీజే అధ్యక్షుడు అబ్దుల్కావి యూసుఫ్ వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అబ్దుల్కావి... ఐసీజే నివేదికను సమర్పించారు. కులభూషణ్ జాదవ్ కేసుపై జులై 17న వెలువరించిన తీర్పులో వియన్నా నిబంధనలోని ఆర్టికల్ 36ను పాక్ ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో తక్షణం దిద్దుబాటు చర్యలు చేట్టాలని ఆయన పాక్‌ను ఆదేశించారు.
ఐరాసకు ఫిర్యాదు
జాదవ్ కేసులో పాక్ తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానం.. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుచేసింది. మరోవైపు వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్ హక్కులను పునరుద్ధరించాలని పాక్‌ను ఆదేశించింది ఐసీజే.
భారత్‌కు ఘనవిజయం..
రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీనిని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని పేర్కొంది. కేసును పరిశీలించిన ఐసీజే జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది భారత్‌కు దక్కిన ఘనవిజయం.
ఇదీ చూడండి: ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల ఘన నివాళి