కరోనా మహమ్మారి ఉద్ధృతితో బ్రెజిల్ సతమతమవుతోంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రపంచానికి ఊపిరితిత్తులుగా ఉన్న అమెజాన్ అటవీ ప్రాంతంతో నిండి ఉన్న అమెజోనస్ రాష్ట్ర రాజధాని మనౌస్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా విఫలమై కొవిడ్ రోగులను పక్క రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నగరంలోని ఆక్సిజన్ నిల్వలు క్షీణిస్తున్నాయని ఇప్పటికే ప్రకటించారు అధికారులు. చికిత్స పొందుతున్న రోగులు ప్రాణవాయువు అందకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
మనౌస్ నగరంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గురువారం ఆక్సిజన్ సిలిండర్లు నగరానికి వచ్చినప్పటికీ.. కొందరికే అందాయి. మిగతా వారికి నిరాశ తప్పలేదు. ఆక్సిజన్ కొరత కారణంగా ఏ రోగులకు చికిత్స అందించాలనేది వైద్యులే నిర్ణయిస్తున్నారు. మరోవైపు.. చనిపోయిన వారిని ఖననం చేసేందుకు వరుసల్లో రావాలని ఓ శ్మశాన వాటిక కోరటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
రెండింతలు..
మనౌస్లో కరోనా ఉద్ధృతి ప్రారంభమైన క్రమంలో రోజుకు 30వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అవసరమయ్యేది. ఇప్పడది రెండింతలకు పైగా పెరిగింది. రోజుకు 70 వేల క్యూబిక్ మీటర్లకు చేరినట్లు ఆక్సిజన్ సరఫరా చేసే వైట్ మార్టిన్స్ సంస్థ తెలిపింది.
235 మంది రోగుల తరలింపు..
నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స తీసుకుంటున్న 235 మంది రోగులను ఐదు రాష్ట్రాలు సహా దేశ రాజధాని బ్రెసీలియాకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఐసీయూలో ఉన్న వారిని కాకుండా మిగతా వారిని మాత్రమే మార్చినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రోగుల తరలింపునకు సహకరించిన ఇతర రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలిపారు అమెజోనస్ గవర్నర్ విల్సన్ లీమా.
" భూమండల ఊపిరితిత్తులుగా ఉన్న అమెజోనస్కు సమస్య తలెత్తిన క్రమంలో యావత్ ప్రపంచం మనవైపే చూస్తోంది. ప్రస్తుతం మేము సాయం కోసం ఆర్తిస్తున్నాం. మా ప్రజలకు ఆక్సిజన్ అవసరం. "
- విల్సన్ లీమా, అమెజోనస్ రాష్ట్ర గవర్నర్.
8 టన్నుల ఆసుపత్రి సామగ్రి..
కొవిడ్-19 రోగుల బంధువులు సామాజిక మాద్యమాల వేదికగా తమ వారి కోసం ఆక్సిజన్ కొనుగోలు చేసి అందించాలని కోరిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. మనౌస్‌కు ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, టెంట్లు వంటి సుమారు 8 టన్నుల ఆసుపత్రి సామగ్రిని దేశ వాయుసేన తరలించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు హామిల్టన్ మౌర్నో.
విమానంలో లోపంతోనే సమస్య..
ఆక్సిజన్ సరఫరా కోసం వినియోగిస్తోన్న వాయుసేన విమానానికి లోపం తలెత్తటం వల్లే కొరత ఏర్పడినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. సాయం కోసం అధ్యక్షుడు బోల్సోనారో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవాలని స్థానిక న్యాయమూర్తిని కోరారు. అయితే ఈ అంశంపై వాయుసేన, కేంద్ర వైద్య శాఖ స్పందించలేదు.
ఇదీ చూడండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి