అమెరికా ఇండియానాపొలిస్ ప్రాంతంలోని ఓ పెంపుడు జంతువుల కేంద్రం(పెట్ స్టోర్)లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో.. దాదాపు 100 జంతువులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన 'అంకుల్ బిల్స్ పెట్ సెంటర్'లో సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. భవనం మొత్తం విషవాయువులు, నల్లటి పొగ దట్టంగా అలుముకోవడం వల్ల.. 40 శునకాలు, 25 పక్షలు మృతిచెందినట్లు ఇండియానాపొలిస్ అగ్నిమాపక అధికారి రిటా రైత్ తెలిపారు. మృతిచెందిన జంతువులు ఇంకా పంజరాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఊపిరితో ఉన్న కొన్ని ఇతర పక్షులు, జంతువులను బయటకి తరలించారు అధికారులు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసి రాలేదు.
ఇదీ చదవండి:వారికి ఒక్క డోసు టీకాతోనే రక్షణ!