కరోనాతో ప్రపంచం వణికిపోతోంది. శనివారం నాటికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య లక్షా 50వేలను దాటింది. కరోనా కేంద్రబిందువు చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇటలీలో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,51,797కేసులు నమోదయ్యాయి. 5వేల 764 మరణాలు సంభవించాయి. 137 దేశాలకు ఈ వైరస్ సోకింది.
ట్రంప్‌కు పరీక్షలు...
అమెరికానూ వైరస్ తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టం చేశారు.
కరోనాతో శ్వేతసౌధం అప్రమత్తమైంది. ట్రంప్‌కు దగ్గరగా వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతను రికార్డు చేస్తోంది.
మరోవైపు... కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైరస్‌తో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సతమతమవుతున్న వారికి సహాయం చేసేందుకు వీలుగా.. ఓ చట్టానికి ఆమోదం పలికింది శ్వేతసౌధం. కరోనాపై పోరుకు దాదాపు 50బిలియన్ డాలర్లు అందిస్తున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
బ్రిటన్‌పై నిషేధం...
ఐరోపాకు రాకపోకలను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు చేసిన సంచలన ప్రకటన. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ జాబితాలోకి బ్రిటన్, ఐర్లాండ్‌ను కూడా చేర్చినట్టు అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తాజాగా వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు.