అమెరికాలోని ఓ వృద్ధాశ్రమంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగించింది. ఏకంగా 66 మంది మాజీ సైనికులను పొట్టనపెట్టుకుంది. ఆ ఆశ్రమంలో ఉన్న మరో 83 మంది మాజీ జవాన్లతోపాటు 81 మంది సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.
మసాచుసెట్స్ బోస్టన్ నగరంలోని హోలీఓక్ సైనిక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
తప్పెలా జరిగింది?
అమెరికావ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇక్కడే అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందన్న విషయంపై రాష్ట్రంతోపాటు ఫెడరల్ అధికారులు విచారణ చేపట్టారు. సైనికులు వైద్య సహాయానికి నిరాకరించి ఉంటారా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
సూపరింటెండెంట్ వివరణ..
ఈ మరణాలపై ఆశ్రమం సూపరింటెండెంట్ బెన్నిత్ వాల్ష్.. తనను తాను సమర్థించుకున్నారు. రాష్ట్ర అధికారులు తాను అజాగ్రత్తగా ఉన్నట్లు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆశ్రమంలో కొన్నేళ్లుగా సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. ఫలితంగా వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చి పనిచేసే వారి నుంచి ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఆశ్రమం నుంచి చాలా మంది వెళ్లిపోయినట్లు వాల్ష్ తెలిపారు. మార్చిలో 230 మంది సైనికులు ఉండగా.. ప్రస్తుతం 100 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారామె.