నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై గత 8 రోజులుగా జరుగుతున్న నిరసనలు శాంతియుతంగా మారాయి. నిరసనలను అణిచేందుకు సైన్యాన్ని మోహరిస్తామని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్.. ఈ అంశమై తమ వైఖరిని మార్చుకున్న నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు ఆఫ్రికన్ అమెరికన్లు.
అధ్యక్షుడి దారిలో నిరసనకారులు..
శ్వేతసౌధం వద్ద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లేదారిలో వేలమంది గుమిగూడారు. వీరిని పోలీసులు అడ్డు తొలగించారు. నిరసనకారులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన చర్చి పాస్టర్లు.. వారికి మంచినీళ్ల సీసాలు అందించారు.
లాస్ ఏంజిల్స్‌లో మోకరిల్లిన మేయర్
లాస్ ఏంజిల్స్‌లో నిరసనలు శాంతియుతంగా మారిన నేపథ్యంలో ఆందోళనకారుల పట్ల కఠినంగా వ్యవహరించే విషయంలో వెనక్కి తగ్గారు నగర మేయర్. నిరసనలు ఆపాలని కోరుతూ మోకరిల్లారు మేయర్ ఎరిక్ గార్సెట్టీ.
జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు..
న్యూయార్క్ నగరంలో అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులను.. ఆందోళనల వీడియో తీయకుండా అడ్డగించారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు.
వెనక్కి తగ్గిన ట్రంప్..
సైన్యం సాయంతో ఆందోళనలను అణిచివేస్తామని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్.. ఈ అంశమై పట్టు సడలించినట్లు తెలుస్తోంది. నిరసనకారులను అదుపు చేసేందుకు స్థానిక ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని శ్వేతసౌధం ఆదేశాలు జారీ చేసింది.
ట్రంప్ వ్యాఖ్యలకు లభించని ఆమోదం..
అంతకుముందు... ఆందోళనలను అణిచేందుకు మిలిటరీని పంపిస్తామని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది. గవర్నర్లు, మేయర్లు సహా వివిధ రాజకీయ వర్గాలు ట్రంప్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నాయి.
'జాత్యాహంకార ధోరణి సరికాదు'
అమెరికాలో చెలరేగుతున్న నిరసనలపై స్పందించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. జాత్యాహంకార ధోరణిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందేనని స్పష్టంచేశారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గం ముఖ్యమేనని చెప్పుకొచ్చారు. ఐరాస ప్రధాన కార్యాలయం ఉన్న న్యూయార్క్ నగరంలో నిరసనలు చెలరేగడం కలిచివేసిందని విచారం వ్యక్తంచేశారు.
జాత్యాహంకారాన్ని సహించొద్దు: పోప్
జాత్యాహంకారాన్ని సహించకూడదని పిలుపునిచ్చారు పోప్ ఫ్రాన్సిస్. మానవత్వ పవిత్రతను కాపాడాలని కోరారు.
ఇదీ చూడండి: పౌరులపైకి సైన్యం విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్