అంగారకుడిపై జీవజాలం జాడను కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. అరుణగ్రహంపై విజయవంతంగా పెర్సీవరెన్స్ రోవర్ అడుగుపెట్టింది. సుమారు రెండేళ్ల పాటు పరిశోధనలు చేపట్టి అక్కడి నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమికి పంపనుంది.
అంగారకుడిపై రోవర్ అడుగుపెట్టిన క్రమంలో.. కాలిఫోర్నియా పసడెనాలోని జెట్ ప్రొపల్సన్ ల్యాబొరేటరీలో పండగ వాతావరణం కనిపించింది. విజయంపై అక్కడి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే.. ఆరు-చక్రాల పెర్సీవరెన్స్ రోవర్ దిగే క్రమంలో భూమికి సంకేతాలు అందేందుకు 11.5 నిమిషాల సమయం పట్టింది. ఈ క్రమంలో కాస్త ఉత్కంఠ నెలకొంది.
" అంగారకుడిపై రోవర్ విజయవంతంగా దిగిందనేది ధ్రువీకరణ అయింది. సురక్షితంగా మార్స్‌పై పెర్సీవరెన్స్ అడుగుపెట్టింది "
- స్వాతి మోహన్, ఫ్లైట్ కంట్రోలర్
2031 నాటికి భూమిపైకి నమూనాలు
అంగారకుడిపైకి నాసా ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాల్లో పెర్సీవరెన్స్ తొమ్మిదవి. అరుణ గ్రహంపైకి పంపిన అతిపెద్ద, అత్యంత అధునాతన వాహనం. కారు సైజులో ఉన్న రోవర్.. ప్లూటోనియం శక్తితో కూడిన వాహనం.. పూర్తిగా రాళ్లు, గుంతలు, నదీ పరివాహక ప్రాంతమైన జెజెరో క్రేటర్ సరస్సు వద్ద దిగింది. మార్స్‌పై జీవజాలం ఉన్నట్లయితే.. 3-4 బిలియన్ ఏళ్ల క్రితం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వచ్చే రెండేళ్ల పాటు తవ్వకాలు చేపట్టి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించనుంది రోవర్. అనుకున్న ప్రకారం రోవర్ నమూనాలకు సేకరించి అంతరిక్షంలో భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వ్యోమనౌకకు అందించ గలిగితే 2031 నాటికి ఆ కాప్స్యుల్ శాస్త్రవేత్తల చేతికి అందనుంది. అంతకు మునుపే అంటే 2030కి వ్యోమగాములను అంగారకంపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఒకేసారి మూడు ప్రయోగాలు..
వారంలోనే అంగారకుడిపైకి చేపట్టిన మూడో ప్రయోగం ఇది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా నుంచి రెండు అంతరిక్ష నౌకలు గత వారం వరుస రోజులలో అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించాయి. ఈ మూడు ప్రయోగాలు 2020 జులైలో మొదలయ్యాయి. ఏడు నెలల పాటు సుమారు 300 మిలియన్ మైళ్లు ప్రయాణించి మార్స్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి.
ఇదీ చూడండి: మార్స్ యాత్రకు కౌంట్‌డౌన్- రోవర్ విశేషాలు తెలుసా?