అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కరోనాపై పోరుకు ఓ సరికొత్త అస్త్రాన్ని రూపొందించింది. వైరస్ బాధితులకు అమర్చేందుకు అధిక పీడనం కలిగిన వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. వైటల్(వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ అక్సెసిబుల్ లోకల్లీ) అని పిలిచే ఈ పరికరం ద్వారా కొవిడ్-19 బాధితులకు కృత్రిమ శ్వాస అందించనున్నారు. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్న రోగులకు దీనిని ఉపయోగించనున్నారు. వ్యాధి తీవ్రమైన వారికి సాధారణ వెంటిలేటర్లు అందుబాటులో ఉండాలనే వ్యూహంతో వైటల్ను రూపొందించినట్లు సమాచారం.
"మేం అంతరిక్ష పరిశోధనల్లో నిపుణులం కానీ.. వైద్య పరికరాల తయారీలో కాదు. అయితే ఉత్తమ ఇంజినీరింగ్, కఠినమైన టెస్టింగ్, వేగవంతమైన తయారీ మా ప్రత్యేకతలు. వైద్య సిబ్బందికి, సమాజానికి మేము ఏవిధంగా ఉపయోగపడతామని ఆలోచించి.. ఈ వెంటిలేటర్‌ను రూపొందించాం."
-మిషెల్ వాట్కిన్స్, జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, నాసా
ప్రస్తుతం అత్యవసర సమయంలో ఈ వెంటిలేటర్‌ను వినియోగించేందుకు అమెరికా ఔషధ ప్రాధికార సంస్థ-ఎఫ్‌డీఏ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది నాసా.
ప్రత్యేకతలు ఇవే..
సంప్రదాయ వెంటిలేటర్‌తో పోల్చితే తక్కువ సమయంలోనే వైటల్ను తయారు చేయవచ్చు. సులభంగా నిర్వహించవచ్చు. ఆసుపత్రులు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు వంటి చోట్ల ఉపయోగించేందుకు వీలుగా దీనిని రూపొందించారు.
ఇదీ చూడండి: వందల మంది వృద్ధులకు ఆత్మీయ నేస్తం ఆ చిన్నారి