ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 20 వేలు దాటింది. ఈ మరణాల్లో 70 శాతం ఐరోపా దేశాల్లోనే సంభవించడం గమనార్హం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. అయితే సుమారు 4 లక్షల 60 వేల మంది ఈ అంటువ్యాధి నుంచి కోలుకోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో.. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
మళ్లీ స్వల్పంగా పెరిగిన మరణాలు...
స్పెయిన్లో ఇవాళ 567 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కరోనా మృతుల సంఖ్య 18,056కు చేరింది. అలాగే ఈ రోజు కొత్తగా నమోదైన 3,045 పాజిటివ్ కేసులతో... మొత్తం కేసుల సంఖ్య 1,72,451కి పెరిగింది.
సోమవారం నాటి గణాంకాలతో పోల్చితే ఇవాళ నమోదైన కేసుల, మరణాల సంఖ్య కాస్త ఎక్కువ. అయితే గత నెలలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి స్పెయిన్ క్రమంగా కరోనా కేసుల, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
1000 దాటిన కరోనా మరణాలు
స్వీడన్లో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1033కు చేరింది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య కూడా 11,445కు పెరిగిందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
బెల్జియంలో ఇవాళ కరోనా బారిన పడి 254 మంది మృత్యువాత పడ్డారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 4,157కు చేరుకుంది. ఇవాళ కొత్తగా నమోదైన 530 కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 31 వేలు దాటింది.
భారీ తగ్గిన కరోనా మరణాలు
ఇరాన్లో మొదటిసారిగా కరోనా మరణాలు 100 కంటే తక్కువ నమోదయ్యాయి. గత 24 గంటల్లో అక్కడ కేవలం 94 మంది మాత్రమే కరోనాతో మృతి చెందారు. అంటే అధికారిక గణాంకాల ప్రకారం రెట్టింపు సంఖ్యలో మరణాలు తగ్గాయి. గత రెండు నెలలుగా అక్కడ లాక్డౌన్ కొనసాగుతుండడం ఫలితాన్ని ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఇరాన్లో కొత్తగా 1,574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 74,877కి చేరింది. ఇప్పటి వరకు ఇరాన్లో 4,683 మంది కరోనాతో మరణించగా... 48,129 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
13 శాతం పడిపోయిన జీడీపీ
బ్రిటన్లో ఇవాళ మరో 778 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మొత్తం మృతుల సంఖ్య 12107కు చేరింది. మరో 5 వేల మందికిపైగా వైరస్ సోకింది.
కరోనా దెబ్బకు 2020 ఆర్థిక సంవత్సరంలో బ్రిటన్ జీడీపీ 13 శాతం పడిపోయే అవకాశం ఉందని ఫిస్కల్ వాచ్డాగ్ 'ది ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ' అంచనా వేసింది. కరోనాను నియంత్రించేందుకు బ్రిటన్లో 3 నెలలుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
ఏప్రిల్ 27 వరకు లాక్డౌన్ పొడిగింపు..
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 24 నుంచి కొనసాగుతున్న లాక్డౌన్ను ఏప్రిల్ 27 వరకు పొడిగిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేయాల్సిన ఈ తరుణంలో అత్యవసర సేవలు తప్ప మిగతా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
నేపాల్లో ఇవాళ నమోదైన 2 కొత్త కేసులతో కలిపి... మొత్తం కేసుల సంఖ్య 16కి చేరింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపుపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు