కరోనా నియంత్రణ కోసం ఇంట్లో వాడే క్లీనర్లు, శానిటైజర్లు, బ్లీచింగ్ పౌడర్ ఎక్కించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు న్యూయార్క్ వాసులకు ప్రమాదంగా పరిణమించాయి. అధ్యక్షుడి ప్రకటనతో అత్యుత్సాహం చూపి పలువురు వాటిని తమపై ప్రయోగించుకున్నారు. క్లీనర్లను ఉపయోగించినవారిలో 30 మంది న్యూయార్క్ వాసులు అనారోగ్యానికి గురయ్యారు.
లైజాల్ వినియోగం వల్ల 9 మంది, బ్లీచింగ్ పౌడర్ కారణంగా 10 మంది, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేసే క్లీనర్లను ఎక్కించుకోవడం వల్ల మరో 11మందికి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అయితే వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని.. ఆసుపత్రిలో చికిత్స చేసే అవసరం రాలేదని సమాచారం.
ఇదీ జరిగింది..
సూర్యరశ్మిలో 2 నిమిషాల పాటు మాత్రమే వైరస్ జీవించి ఉండగలదని కరోనా వైరస్‌పై రోజూవారీ ప్రకటనలో భాగంగా ఓ శాస్త్రవేత్త గురువారం ప్రదర్శన చేశాడు. అయితే.. శక్తిమంతమైన లైటును శరీరంలోకి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందని వ్యంగ్యంగా స్పందించారు అధ్యక్షుడు ట్రంప్. భద్రత విభాగంలోని మరో అధికారి సూచనను ఉటంకిస్తూ కరోనా నియంత్రణ కోసం బ్లీచింగ్ పౌడర్, శానిటైజర్‌ను శరీరంలోకి ఎక్కించుకోవాలని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ మాటలను నమ్మిన పలువురు వాటిని తీసుకుని అనారోగ్యానికి గురయ్యారు.
ఇదీ చూడండి: ట్రంప్ చెప్పిన 'కరోనా థియరీ' వ్యంగ్యమేనట!