అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధన చేస్తున్న ఫార్మా దిగ్గజం మోడెర్నా తమ అధ్యయనానికి సంబంధించి కీలక విషయం బయటపెట్టింది. తమ వ్యాక్సిన్ కోతులకు కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ప్లేసిబో లేదా ఎంఆర్ఎన్ఏ- 1273గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ తయారీలో అమెరికా ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు కూడా సానుకూలంగా వచ్చినట్లు వెల్లడించింది సంస్థ. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందుకోసం 33,000 మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నట్లు చెప్పింది.
కోతులపై పరిశోధన సాగిందిలా..
8 కోతులకు ఇంతకుముందు రెండు దశల్లో వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపింది సంస్థ. వీటిని 28 రోజుల వ్యవధిలో ఇచ్చినట్లు పేర్కొంది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల కంటే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిపింది. అయితే తమ వ్యాక్సిన్ వల్ల శ్వాస సంబంధిత సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్లు గుర్తించలేదని స్పష్టం చేసింది.
రెండు దశల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయిన నాలుగు వారాల అనంతరం కోతులు కరోనాకు కాంటాక్ట్ అయ్యాయని.. రెండు రోజుల అనంతరం పరీక్షలు నిర్వహించగా ఏడింటి ఊపిరితిత్తుల్లో వైరస్ పునరుత్పత్తిని కనుగొనలేదని చెప్పింది. అయితే అన్నింటి ఊపిరితిత్తుల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేసింది.
వైరస్ కాంటాక్ట్‌కు గురయిన రెండు రోజుల అనంతరం వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల ముక్కుల వద్ద ఎలాంటి లక్షణాలు కనిపించలేదని వెల్లడించింది. జంతువుల్లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వైరస్‌ను అరికట్టడం ఇదే తొలిసారని పేర్కొంది పరిశోధన బృందం.
తమ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తుల్లో వైరస్ కణాలు పునరుత్పత్తి చెందకపోవడం, బాహ్య అవయవాల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడం వల్ల మహమ్మారి వ్యాప్తి తగ్గేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడింది పరిశోధన బృందం.
ఇదీ చూడండి: 6 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం యూకే ఒప్పందం