మోడెర్నా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితంగా, సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) వెల్లడించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మోడెర్నా వ్యాక్సిన్ 94.1శాతం సమర్థత చూపించిందని.. ఇదివరకే ప్రకటించిన ఫలితాలను తాజా విశ్లేషణ ధ్రువీకరిస్తున్నట్లు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ప్రయోగాలకు సంబంధించి ఇంతకుముందు వెల్లడించిన సమాచారం కంటే తాజాగా ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ అనుమతిపై స్వతంత్ర నిపుణుల బృందం నిర్ణయం తీసుకునే రెండు రోజుల ముందే ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేయడం మోడెర్నా టీకా వినియోగానికి మార్గం ఏర్పడినట్టు అర్థమవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే.. మోడెర్నాను అనుమతించిన తొలిదేశంగా అమెరికా నిలుస్తుంది.
మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ అన్నివర్గాల ప్రజలపై సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు సమాచార విశ్లేషణలో ఎఫ్‌డీఏ గుర్తించింది. 65ఏళ్లకు పైబడి వయసున్న వారిలో ఈ వ్యాక్సిన్ 86.4 సమర్థత చూపించగా, 18 నుంచి 65 ఏళ్లలోపు వారిలో 95.6శాతం ప్రభావవంతంగా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు తెలిపింది.
అమెరికాలో ఇప్పటికే ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా మోడెర్నా టీకాపై డిసెంబర్ 17న ప్రకటన రానుంది. కమిటీ సభ్యుల్లో 17-4 ఓట్లతో ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కమిటీలో మొత్తం 22మంది సభ్యులుండగా ఒకరు హాజరుకాలేదు. ఫైజర్, మోడెర్నా ఈ రెండు వ్యాక్సిన్‌లు కూడా మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అయితే, ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా మోడెర్నాకు మాత్రం అలాంటి ఇబ్బందులేవి లేవని ఆ సంస్థ ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది.
ఇదీ చూడండి: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని