అమెరికాలో ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మరణించిన మినియాపోలిస్ నగరంలో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌కు అక్కడి నగర మండలిలోని మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 12 మంది సభ్యులుగల మండలిలో తొమ్మిది మంది అందుకు సుముఖంగా ఉన్నట్లు అధ్యక్షుడు లిసా బెండర్ వెల్లడించారు. ఆ స్థానంలో పౌరుల రక్షణ కోసం కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆదివారం ఫ్లాయిడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నగరంలోని ఓ ప్రముఖ పార్కులో హాజరైన జన సమూహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన బెండర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
"మన పోలీసు వ్యవస్థ మనకు భద్రత కల్పించలేకపోతుందన్నది సుస్పష్టం. వ్యవస్థను ప్రక్షాళించాలన్న మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పోలీసు వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌కు ఈ ర్యాలీలో పాల్గొన్న మండలి సభ్యులంతా సుముఖంగా ఉన్నారు. మనల్ని సురక్షితంగా ఉంచగలిగే మరో వ్యవస్థను సృష్టించుకుందాం"
- లిసా బెండర్, నగర మండలి అధ్యక్షుడు
మే 25న శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన నాటి నుంచి దేశంలో తీవ్ర స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నాయి. మినియాపోలిస్‌లో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని ప్రజలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి పోలీసులపై గత కొన్నేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యహంకారంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మిన్నెసొటా రాష్ట్రం అక్కడి పోలీసు విభాగంపై 'పౌర హక్కుల విచారణ'కు ఆదేశించింది. ఆందోళనల సమయంలో ప్రజలపై ప్రయోగించే 'చోక్‌హోల్డ్', 'నెక్ రిస్ట్రెయింట్స్' వంటి కఠినమైన పద్ధతులపై నిషేధం విధించింది.
అమెరికాలో పోలీసు విభాగాన్ని పూర్తిగా రద్దు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2012లో క్యామ్‌డెన్, న్యూజెర్సీలో నేరాలు పెరిగిపోవడం వల్ల పోలీసు విభాగాన్ని రద్దు చేశారు. క్యామ్‌డెన్ కౌంటీకి ప్రత్యేకంగా ఓ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో 2000లో క్రాంప్టన్, కాలిఫోర్నియాలోనూ పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆ బాధ్యతల్ని లాస్ ఏంజిలిస్ కౌంటీ విభాగానికి అప్పగించారు.
- ఇదీ చూడండి: మరో 'ఫ్లాయిడ్' ఉదంతం- నల్లజాతీయుడిపై కాల్పులు!