మెక్సికోలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. బస్సులపై దాడిచేస్తూ ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. దొంగల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలే ఓ సరికొత్త పద్ధతిని అనుసరిస్తూ దొంగలకు షాకిస్తున్నారు. అదే 'డమ్మీ సెల్ఫోన్' పద్ధతి.
మెక్సికో నగరంలో దొంగల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. పాదచారులే లక్ష్యంగా విరుచుకుపడి వారిని దోపిడీ చేస్తున్నారు. బస్సుల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ కూడళ్లలో ఆగి ఉన్న వాహనదారులనూ వదిలిపెట్టడం లేదు. దోపిడీలకు సంబంధించి 2019 తొలి నాలుగు నెలల్లోనే రోజుకు సగటున 70 ఫిర్యాదులు నమోదయ్యాయి.
దొంగల నుంచి తప్పించుకోవడానికి డమ్మీ చరవాణులను వినియోగిస్తున్నారు అక్కడి ప్రజలు.
"సెల్ఫోన్లు ఇవ్వాలని దొంగలు బెదిరిస్తారు. కొన్ని సెకన్లలోనే తమ వద్ద ఉన్న చరవాణులను ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడతారు. నిజమైన మొబైల్ బదులు డమ్మీ సెల్ఫోన్ ఇస్తారు."
-అక్సెల్, సెల్ఫోన్ విక్రయదారుడు
నిజమైన ఐఫోన్ ధర 900 డాలర్లు. డమ్మీ ఐఫోన్ ధర సుమారు 15 డాలర్లు. దొంగతనం జరుగుతున్న సమయంలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా కష్టం. ఈ విధంగా డమ్మీ ఫోన్లను దొంగలకు అప్పగించి అసలైనవాటిని కాపాడుకోగలుగుతున్నారు మెక్సికో వాసులు.
సాధారణంగా డమ్మీ మొబైళ్లను సెల్ఫోన్ దుకాణంలో చూస్తాం. నిజమైన చరవాణి బదులు డమ్మీని ప్రదర్శిస్తారు. దుకాణాల్లో దొంగలు పడినా డమ్మీలనే దొంగలిస్తారు కాబట్టి పెద్ద నష్టం జరగదు. కానీ ఇప్పుడు దొంగలకు భయపడి నిజంగానే అందరూ డమ్మీలు వాడే పరిస్థితి నెలకొందని సెల్ఫోన్ వ్యాపారి గ్లోరియా తెలిపారు.
"14 ఏళ్లుగా ఇక్కడ డమ్మీ మొబైళ్లను విక్రయిస్తున్నాం. అప్పట్లో వీటిని ప్రదర్శన కోసమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దొంగల నుంచి తప్పించుకోవటానికి వీటిని వాడుతున్నారు."
--- గ్లోరియా, సెల్ఫోన్ వ్యాపారి.
అయితే డమ్మీ మొబైళ్లను దొంగలు గుర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని విక్రయదారులు హెచ్చరిస్తున్నారు