పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టైన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి(Mehul Choksi) సంబంధించి కొన్ని ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఛాయాచిత్రాల్లో ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆంటిగ్వా న్యూస్ రూం విడుదల చేసిన ఈ ఫొటోల్లో.. ఛోక్సీ(Mehul Choksi) చేతులు, ఎడమ కన్నుపై తీవ్రగాయాలైనట్లు ఉన్నాయి. అరెస్టైన తర్వాత ఇవే ఛోక్సీ మొదటి చిత్రాలు అని ఆంటిగ్వా న్యూస్ రూం.. ట్విట్టర్ వేదికగా తెలిపింది.



గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయిన మెహుల్ ఛోక్సీ(Mehul Choksi).. రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కారు. అయితే కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది వేన్ మార్ష్ ఆరోపించారు. చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత ఛోక్సీతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆయనను తీవ్రంగా కొట్టినట్లు అన్పిస్తోందని.. కళ్లు ఉబ్బిపోయాయని, ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని మార్ష్ చెప్పారు. ఈ మేరకు డొమినికా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఆయన దాఖలు చేశారు. దీంతో ఛోక్సీని భారత్‌కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 2న జరగనుంది.
ఇదీ చూడండి: Mehul Choksi: ఛోక్సీది అరెస్ట్ కాదు కిడ్నాప్!