ఒక అరటి పండు ఖరీదు ఎంత ఉంటుంది..? రూ.4, రూ.5, రూ.10. మహా అయితే రూ.20. కానీ... ఓ వ్యక్తి మాత్రం రూ. 85 లక్షలు విలువైన అరటి పండును తిన్నాడు.
ఆ పండుకు ఎందుకంత క్రేజ్?
అది టేపుతో గోడకు అతికించిన సాధారణ అరటి పండే. కానీ కళాత్మక దృష్టితో చూస్తే మాత్రం ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుందట. అంతటి 'ప్రత్యేక దృష్టి' ఉన్న ఓ ఫ్రెంచ్ వ్యక్తి... ఆ కళాఖండాన్ని లక్షా 20 వేల డాలర్లు (రూ.85 లక్షల కంటే ఎక్కువ)కు కొనుగోలు చేశాడు. తన 'ప్రతిభ'కు లభించిన 'ఆదరణ'తో ఆనందంలో మునిగిపోయాడు ఇటలీకి చెందిన కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్. కష్టపడి మరో అరటి పండును గోడకు అతికించి, మరో కళాఖండాన్ని సృష్టించాడు. అమెరికా మయామీ బీచ్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్లో దీనిని అమ్మకానికి పెట్టాడు. ఆ పండు కళకు 'కమీడియన్' అని పేరు కూడా పెట్టాడు.
ఆ కళాఖండంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు జనం. అరటి పండుకు ఇంత ధర ఏంటని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించారు.
ఆకలేసి...
కళా ప్రదర్శనశాలలో గోడకు అతికించిన ఆ అరటి పండును తీసుకొని ఆరగించాడు డేవిడ్ డాటునా. అతడు కూడా ఓ కళాకారుడే. డేవిడ్ చేష్టకు నిర్వాహకులు షాక్ అయితే, చూసేందుకు వచ్చిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు.
పండు చాలా రుచిగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు డేవిడ్. 'ఆర్ట్ పర్ఫార్మెన్స్.. హంగ్రీ ఆర్టిస్ట్', 'థ్యాంక్యూ.. చాలా బాగుంది' అని హ్యాష్‌ట్యాగ్‌లు జోడించాడు.
''నేను చేసిన పనికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే.. కళాకారులు ప్రజల్ని ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనే తాపత్రయపడుతుంటారు. నేను చేసింది అదే.''
- డేవిడ్ డాటునా
కళాకారుడి కాన్సెప్ట్‌ను మాత్రమే తాను తిన్నానని డేవిడ్ చమత్కరించాడు.
"ఒక కళాకారుడు మరొక కళాకారుడి కళను తినడం ఇదే మొదటిసారి అని నేను చెప్తున్నా. కానీ ఈ సందర్భం.. నేను ఒక కళను తినడం లాంటిది కాదు. ఇదొక గ్యాలరీ. ''ఇది అరటిపండు కాదు, ఇదో కాన్సెప్ట్''. మీకు తెలుసా, నేను కళాకారుడి ఆలోచనను తిన్నాను."
- డేవిడ్ డాటునా
వదిలేసిన నిర్వాహకులు...
లక్షల రూపాయలు తెచ్చిపెట్టే అరటిపండును క్షణంలో తినేసిన డేవిడ్‌కు న్యాయపరమైన చిక్కులు తప్పవని అంతా భావించారు. కానీ కేసులు ఏం పెట్టకుండా నిర్వాహకులు వదిలేశారు. కాకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారు. అదే గోడపై అదే చోట టేప్‌తో మరో అరటి పండును అతికించారు. ఈ కొత్త కళాఖండాన్ని ఈసారి లక్షన్నర డాలర్లకు విక్రయించాలని నిర్ణయించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో దొంగలు.. బంగారు టాయ్‌లెట్‌ను దోచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో చేసిన టాయ్‌లెట్ విలువ రూ. 8 కోట్లకు పైమాటే.
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!