ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా... ఇటలీలో వేలాది మంది ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావిత దేశాలు ఇటలీ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని, మహమ్మారిని అరికట్టేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు పరిశోధకులు. తాజాగా వాటి విశ్లేషణను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు.
ఎక్కువగా ఆ వయసు వారిపైనే
ఐరోపాలోని దేశాలన్నింటితో పోలిస్తే ఇటలీలో వృద్ధుల సంఖ్య అధికం. జపాన్ తర్వాత ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వృద్ధులు కలిగిన దేశం ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. ఇటలీలో వైరస్ సోకి మరణించిన వారి సగటు వయస్సు 80 సంవత్సరాలు ఉండగా.. అత్యవసర సేవలు తీసుకున్న రోగుల సగటు వయస్సు 67 ఏళ్లు ఉందని విశ్లేషణలో తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన నివసించే ప్రాంతాలనూ అందులో ప్రస్తావించారు. అలస్కాలో 9.5 శాతం, ఫ్లోరిడాలో 19.1 శాతం, ఇటలీలో 23.1 శాతం ఈ జనాభా ఉన్నట్లు వివరించారు.
వారిపైనే అధిక ప్రభావం
కరోనా మహమ్మారి ప్రధానంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని బలి తీసుకుంటోంది. ఇటలీలో ఎక్కువ మంది పొగాకు, గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైరస్ ప్రభావితమైన దేశాలన్నీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) పడకలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇటువంటి సర్దుబాటుతో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో మహమ్మారిని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం
ఇటలీలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై.. వైరస్ టెస్టుల భారం పడటం వల్లే మరణాలు పెరిగాయని మరో కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. ఇటీవల ఓ పట్టణంలో 3,300 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 3 శాతం పాజిటివ్ నిర్ధరణ అయ్యాయని ఉదారణగానూ పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ లేకుంటే వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందనీ హెచ్చరించారు.
ఆ కార్యక్రమం వల్లే..
ఫిబ్రవరి 19న జరిగిన ఛాంపియన్ లీగ్ మ్యాచ్‌కి బెర్గామో నగరంలోని మూడోవంతు ప్రజలు హాజరయ్యారు. రాత్రంతా అక్కడ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి పెరిగి.. కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెను భారం పడిందని వివరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలన్న ఆంక్షలనూ చాలా మంది లెక్కచేయలేదని తెలిపారు. ఇందుకు పోలీసులు నమోదు చేసిన కేసుల సంఖ్యనూ ఉదహరణగా చూపారు. పెద్దఎత్తున సమావేశాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.
వైద్య పరికరాల కొరత
ఇటలీలో అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఐసీయూ, సబ్టెన్సివ్ కేర్ విభాగాల్లో పడకలు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
- ఇటలీలో లక్షమందికి అందుబాటులో ఉన్న ఐసీయూ పడకలు 5,090.
- అమెరికాలో లక్షమందికి కేవలం 36 ఐసీయూ పడకలు.
ఆసుపత్రులు రద్దీగా మారడం వల్ల వైద్య సిబ్బందికీ వైరస్ సోకినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 30 నాటికి సుమారు 9,000 మంది వైద్య సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడినట్లు పేర్కొన్నారు. ఇందువల్ల ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడిందని చెప్పారు.
కరోనా అనుమానిత రోగులకు తప్పనిసరి పర్యవేక్షణ అవసరమైతేనే.. ఆసుపత్రులకు తీసుకురావాలని ఇతర దేశాలకు సూచించారు పరిశోధకులు. ఆసుపత్రిలోనూ పరిశుభ్రతను పాటించాలని తెలిపారు.
ఎలా చనిపోతున్నారో చెప్పడం కష్టం!
"వైరస్ కారణంగా చనిపోతున్న వారు కేవలం కరోనాతోనే మరణిస్తున్నారా? లేదంటే వైరస్‌తో పాటు ఇతర జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారా?" అనే విషయాన్ని వెల్లడించడం కష్టమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చనిపోయిన వారిలో 99 శాతం మంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతుండగా.. 48.6 శాతం మందికి మూడు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులుండటం వల్ల మరణించినట్లు పేర్కొన్నారు.