కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక సమస్య అని... దాయాదులు శాంతి చర్చలు చేపడితే స్వాగతిస్తామని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.
ఉగ్రవాద నిర్మూలనకు నిరంతర, పటిష్టమైన చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌కు అమెరికా సూచించింది. అప్పుడే భారత్‌తో విజయవంతంగా శాంతి చర్చలు జరగడానికి వీలవుతుందని స్పష్టం చేసింది.
"కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక సమస్య. ఇరుదేశాలు శాంతి చర్చలు చేపడితే దాన్ని ట్రంప్ ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది."-అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జూన్‌లో జపాన్ ఒసాకాలో జీ-20 సదస్సు వేదికగా కశ్మీర్ సమస్యపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు ట్రంప్. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం అవసరమని భారత ప్రధాని కోరినట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.
భారత్‌కు క్షమాపణలు..
కశ్మీర్ అంశంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా చట్టసభ్యులు తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు డెమొక్రటిక్ పార్టీ నేత బ్రాడ్ షెర్మన్.
పలువురు కాంగ్రెస్ చట్టసభ్యులు కశ్మీర్ అంశంలో భారత్ వైఖరికి మద్దతుగా నిలిచారు. కశ్మీర్ అంశాన్ని పూర్తిగా భారత్, పాక్ దేశాలు... ద్వైపాక్షిక శాంతి చర్చల ద్వారా తేల్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
భారత్ తిరస్కరణ
ట్రంప్ ప్రతిపాదనను భారత్ ఇప్పటికే తిరస్కరించింది. అలాగే జీ-20 సదస్సు సందర్భంగా... కశ్మీర్ విషయంలో సహాయం చేయమని మోదీ కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలనూ ఖండించింది.
ఇదీ చూడండి: కుమారస్వామి 'రాజీనామ లేఖ' వెనకున్న కథేంటీ?