Kamala Harris Husband: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాషింగ్టన్‌లోని ఓ ఉన్నత పాఠశాలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమహాఫ్ హాజరవగా.. బాంబు బెదిరింపు కారణంగా ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.
డన్‌బార్ ఉన్నత పాఠశాలలో బ్లాక్ హిస్టరీ మంత్ సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు ఎమహాఫ్. దీనిలో భాగంగా పాఠశాలను పరిశీలించారు. ఐదు నిమిషాల పాటు పాఠశాల మ్యూజియంలోనే ఎమహాఫ్ ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన భద్రతా సిబ్బంది వెళ్లి.. 'మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి' అని హూటాహుటిన ఎమహాఫ్ను బయటకు తీసుకెళ్లారు. మరోవైపు పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భవనాన్ని ఖాళీ చేయాలని ప్రకటన చేశారు. దీంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం భద్రతా సిబ్బంది పాఠశాల మొత్తం తనిఖీలు చేశారు.
బాంబు బెదిరింపు వచ్చినట్లు కొలంబియా ప్రభుత్వ పాఠశాల ప్రతినిధి ఎన్రిక్ గుటిరెజ్ తెలిపారు. ఇది ఎమ్‌హాఫ్ సందర్శనకు సంబంధించిందా? బ్లాక్ హిస్టరీ మంత్ ఈవెంట్‌కి సంబంధించిందా? అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు.
ఎమహాఫ్ ప్రతినిధి కేటీ పీటర్స్.. బాంబు బెదిరింపు ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు అప్రమత్తమైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: విరిగిపడ్డ కొండచరియలు.. బురదలో కూరుకుపోయి 14 మంది మృతి