అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కమలా హారిస్ ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టన్నారు. ఈ పదవిని చేపడుతున్న తొలి నల్లజాతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిసారి వేలాది మంది సమక్షంలో ఘనంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం.. ఈసారి కరోనా, ఇతర భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమ షెడ్యూల్ వివరాలు
ఉదయం 10 గంటలు( భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30గం.): అవర్ వైట్‌హౌస్, యాన్ ఇనాగ్యురల్ సెలబ్రేష్ ఫర్ యంగ్ అమెరికన్స్
యువ అమెరికన్ల కోసం ప్రమాణస్వీకారోత్సవాన్ని తొలిసారి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఎంటర్టైనర్, అడ్వకేట్ పీపీ కాల్మర్ హోస్ట్‌గా వ్యవహరిస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత(భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గం.):
క్యాపిటల్ భవనం వెలుపల బైడెన్, కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఇద్దరూ అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెన్నిఫర్ లోపెజ్, గార్త్ బ్రూక్స్ ప్రదర్శన చేస్తారు.
ప్రమాణస్వీకారం అనంతరం: అమెరికావ్యాప్తంగా వర్చువల్ పరేడ్
బైడెన్, హారిస్ ఎస్కార్ట్‌తో శ్వేతసౌధం బయలుదేరతారు. ఆ సమయంలో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వర్చువల్ పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్‌కు నటుడు, దర్శకుడు, నిర్మాత టోనీ గోల్డ్ విన్ హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఇతర సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొంటారు.
రాత్రి 8:30గంటలు(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7గం.): అమెరికా ప్రైమ్‌టైమ్ స్పెషల్
గంటన్నర పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. నటుడు టామ్ హ్యాంక్స్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. ప్రముఖ సింగర్లు, నటులు, డ్యాన్సర్ల ప్రదర్శన ఉంటుంది.