అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) పూర్తిగా ఆక్రమించడానికి ముందు.. ఆ దేశానికి సైనిక సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంసిద్ధత వ్యక్తం చేశారు! అయితే రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులను క్రమంగా నియంత్రణలోకి తీసుకొచ్చే పటిష్ఠ ప్రణాళిక తమ వద్ద ఉందని బహిరంగంగా నిరూపించుకోవాల్సిందిగా అఫ్గాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి(Ashraf Ghani) ఆయన షరతు విధించారు. మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వంటి కీలక నేతలతో సఖ్యతతో వ్యవహరించాలనీ సూచించారు. తాలిబన్లు అఫ్గాన్‌ను(Afghanistan Taliban) ఆక్రమించడానికి ముందు బైడెన్-ఘనీ మధ్య చివరిసారిగా జరిగిన ఫోన్‌కాల్ సంభాషణలో ఈ విషయాలన్నీ చర్చకు వచ్చాయి. సంబంధిత వివరాలు తాజాగా బయటికొచ్చాయి.
బైడెన్, ఘనీ చివరిసారిగా ఈ ఏడాది జులై 23న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దాదాపు 14 నిమిషాల పాటు వారి సంభాషణ సాగింది. సైనిక సహాయం, రాజకీయ వ్యూహం తదితర అంశాలపై అందులో చర్చించారు.
''పరిస్థితులను నియంత్రించేందుకు మీ దగ్గర తగిన ప్రణాళిక ఉంటే.. మేం వాయుసేన ద్వారా సహాయం కొనసాగిస్తాం. అయితే మెరుగైన ప్రణాళిక ఉందని మీరు బహిరంగంగా నిరూపించుకోవాలి. సైనిక వ్యూహాల రూపకల్పనలో శక్తిమంతమైన అఫ్గానీల సహాయం తీసుకోండి. రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ వంటివారికి తగిన బాధ్యతలు అప్పగించండి.'' అని ఘనీకి బైడెన్ సూచించారు.
అఫ్గాన్ బలగాలు పెద్దగా పోరాట పటిమను ప్రదర్శించడం లేదన్న భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దాన్ని చెరిపేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ''సుశిక్షితులైన 3 లక్షల మంది సైనికులు మీ వద్ద ఉన్నారు. తాలిబన్ ముఠా సభ్యుల సంఖ్య కేవలం 70-80 వేలు'' అంటూ ఘనీలో ధైర్యం నింపేందుకు బైడెన్ ప్రయత్నించారు. ''మీ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా కృషిచేస్తాం. అంతేకాదు.. భవిష్యత్తులో మీ సర్కారు ఇంకా బలపడేందుకూ మద్దతిస్తాం'' అని ఘనీకి హామీ ఇచ్చారు.
'కర్జాయ్‌తో లాభం లేదు'
పాకిస్థాన్ రూపొందించిన ప్రణాళికతోనే అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమిస్తున్నారని బైడెన్‌తో సంభాషణలో ఘనీ పేర్కొన్నారు. తాలిబన్లకు పాక్ అన్ని వసతులూ సమకూరుస్తోందని చెప్పారు. కనీసం 10-15 వేల మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు తాలిబన్లతో కలిసి విధ్వంసం సృష్టిస్తున్నారని.. వారిలో చాలామందిని పాకిస్థానే తమ దేశంలోకి పంపించిందని ఆరోపించారు. హమీద్ కర్జాయ్‌తో కలిసి విలేకర్ల సమావేశాల్లో పాల్గొనాలంటూ బైడెన్ చేసిన సూచనకు ఘనీ పెదవి విరిచారు.
''కర్జాయ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదు. ఆయన నన్ను వ్యతిరేకిస్తారు. ప్రస్తుతం మనకున్న తక్కువ సమయంలో అందర్నీ కలుపుకొని వెళ్లడం సాధ్యం కాదు. కర్జాయ్‌తో కలిసి పనిచేసేందుకు నేను చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నా. చివరిసారిగా మేం భేటీ అయినప్పుడు 110 నిమిషాల పాటు చర్చలు జరిపాం. ఆయన నాకు శాపనార్థాలు పెట్టారు. అమెరికా బానిసనంటూ నన్ను దూషించారు.'' అని వివరించారు. బైడెన్-ఘనీల మధ్య ఈ సంభాషణ జరిగే నాటికే అఫ్గాన్ వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలను తాలిబన్లు ఆక్రమించారు. గత నెల 14 కల్లా వారు కాబుల్ శివార్లలోకి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు ఘనీ దేశం విడిచి పారిపోయారు.
ఇవీ చూడండి: US Military: అఫ్గాన్ 'అస్త్రాలను' పేల్చేసిన అగ్రరాజ్యం