అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్ పాలసీ డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ అయిన 'మాలా అడిగా'ను నియమించారు. ఇప్పటికే అడిగా... బైడెన్-కమలా హారిస్ ప్రచారానికి సీనియర్ విధాన సలహాదారుగా పనిచేశారు. అంతేగాక అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్‌కు సీనియర్ సలహాదారుగా పని చేసిన అనుభవం ఉంది. బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాలకు డైరెక్టర్‌గా ఉన్నారు.
మొత్తం నలుగురు సభ్యులతో కూడిన సలహాదారుల బృందంలో చోటు దక్కించుకున్నారు మాలా అడిగా. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలో ఆమె.. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా సేవలు అందించారు. ప్రపంచ మహిళా సమస్యలపై సీనియర్ సలహాదారుగా పనిచేశారు. జాతీయ భద్రతా సిబ్బంది మానవహక్కుల డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
చికాగోలో న్యాయవిద్యను అభ్యసించిన మాలా అడిగా.. శిక్షణ పూర్తి అయిన తరువాత అక్కడి కోర్టులో పనిచేశారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌కు సలహాదారుగా అడిగాను..అప్పటి అధ్యక్షుడు ఒబామా నియమించారు.