రాహుల్ దూబే అనే ఓ భారతీయ-అమెరికన్‌కు సమున్నత గౌరవం దక్కింది. టైమ్ మేగజైన్ విడుదల చేసిన 'హీరోస్ ఆఫ్ 2020' జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. 70 మంది 'బ్లాక్ లివ్స్ మేటర్' ఉద్యమకారులకు తన ఇంటిలో ఆశ్రయం కల్పించినందుకు గానూ ఆయనను టైమ్స్ ఈ ఏటి మేటి హీరోల్లో ఒకరిగా అభివర్ణించింది.
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా.. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో జూన్1న ఆందోళనకారులు నిరసన బాట పట్టారు. ఆ రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన నిరసనకారులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. బారికేడ్లను అడ్డుగా పెట్టారు. పెప్పర్ స్ప్రేతో దాడులకు దిగారు. అయితే.. ఆ సమయంలో వారికి సహాయం చేయడానికి రాహుల్ దూబే సిద్ధమయ్యారు. తన ఇంటి తలుపులు తెరిచి వారికి ఆశ్రయం కల్పించారు.
"నేను నా ఇంటి తలుపులు తెరిచి వారిని లోపలికి రమ్మని పిలిచాను. దాదాపు 70 మంది నిరసనకారులు ఆరోజు నా ఇంట్లో తలదాచుకున్నారు. వారంతా దగ్గుతున్నారు. ఏడుస్తున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. చాలా మంది.. పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. అందిరికీ గాయాలయ్యాయి. ఆ పరిస్థితుల్లో నా స్థానంలో ఎవరున్నా నాలాగే వారికి ఆశ్రయం కల్పించేవారు. ఆ రాత్రి నిరసనకారులను బయటకు రప్పించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను ఆర్డర్ చేసిన పిజ్జాలను చేరకుండా అడ్డగించారు."
-- రాహుల్ దూబే
ఆ తర్వాత.. రాహుల్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ట్విట్టర్ వేదికగా ఆయనకు నిరసనకారులు ప్రశంసలు కురిపించారు. లక్ష్యం కోసం వెనుకడుగు వేయొద్దని, శాంతిమార్గంలో నిరసన కొనసాగాలని రాహుల్ దూబే తమకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారని వారంతా కొనియాడారు.
అమెరికా పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రో-అమెరికన్ మే 25న ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఆపదలో ఉన్న వారికి ఆహారం, ఆశ్రయం కల్పించిన వారిని 'హీరోస్ ఆఫ్ 2020'గా గుర్తించామని టైమ్స్ పేర్కొంది. వీరంతా తమ విధులను దాటి ఇతరులకు సాయపడ్డారని తెలిపింది.
'హీరోస్ ఆఫ్ 2020'లో ఇంకా ఎవరెవరంటే..
- ఆస్ట్రేలియాకు చెందిన అగ్నిమాపక సిబ్బందికి 'హీరోస్ ఆఫ్ 2020' జాబితాలో స్థానం కల్పించింది టైమ్స్.
- సింగపూర్‌లో ఫుడ్ స్టాల్ యజమానులైన జాస్ చువా, హుంగ్ జెన్‌లకు కూడా ఈ జాబితాలో స్థానం దొరికింది. మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆకలిని వారు తీర్చారు.
- చికాగోకు చెందిన రెష్రోనా ఫిట్జ్‌ప్యాట్రిక్ ఆమె భర్త డెరిక్ ఫిట్జ్ప్యాట్రిక్లకు హీరోస్ ఆఫ్ 2020 ఈ జాబితాలో చోటు దక్కింది. వాళ్లు చర్చిలో ప్రజలకు ఆశ్రయం కల్పించారు.
- న్యూజెర్సీకి చెందిన గ్రెగ్ డైలీ అనే పేపర్ బాయ్.. హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. మార్చి నెల మధ్య నుంచి 140కి పైగా ఇళ్లకు నిత్యావసరాలను సరఫరా చేశాడతడు.
ఇదీ చూడండి:'దివాలా' సంస్థకు రుణం- చిక్కుల్లో ట్రంప్ అల్లుడు!