5జీ సహా భవిష్యత్తు తరం సాంకేతికతలను భారత్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాయి. పారదర్శకంగా, స్వేచ్ఛగా, విశ్వసనీయంగా ఉపయోగించుకునేలా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత సంతతి సహా భారత్, ఇజ్రాయెల్, అమెరికా ప్రజల మధ్య సహకారం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్ల క్రితం 2017, జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళ్లిన క్రమంలో మూడు దేశాల భాగస్వామ్యానికి అంకురార్పణ జరిగింది.
భారత్-ఇజ్రాయెల్-అమెరికాల మధ్య వ్యూహాత్మక, సాంకేతిక, అభివృద్ధి రంగాల్లో సహకారం కోసం వర్చువల్గా జరిగిన త్రైపాక్షిక సదస్సులో పలు విషయాలు వెల్లడించారు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఉప నిర్వాహకురాలు బోనీ గ్లిక్.
" 5జీ భాగస్వామ్యం మూడు దేశాల సహకారంలో కేవలం మొదటి అడుగు. భవిష్యత్తు తరాల సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు శాస్త్రీయ, పరిశోధన, అభివృద్ధిలో సహకరిస్తాం. ప్రపంచ అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి ఈ భాగస్వాములతో కలిసి పనిచేయటం సంతోషంగా ఉంది."
- బోనీ గ్లిక్, యూఎస్ఏఐడీ ఉప నిర్వాహకురాలు.
త్రైపాక్షిక భాగస్వామ్య సదస్సులో భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా, భారత రాయబారి సంజీవ్ సింగ్లా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జీ-20: మోదీ-ట్రంప్ '5జీ' స్నేహగీతం