ఆధునిక కాలంలో ఎదురవుతున్న కొత్త ముప్పుల నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను రక్షించుకోవాలంటే పటిష్ఠ సమాచార, అత్యాధునిక నిఘా వ్యవస్థల అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని హింసాత్మక చర్యలకు వినియోగించుకుంటూ శాంతి స్థాపనకు విఘాతం కల్పిస్తున్న వారిని దీటుగా ఎదుర్కొనేలా ఐరాస శాంతి పరిరక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన భద్రత మండలి సమావేశంలో 'శాంతి స్థాపన కోసం సాంకేతికత: రక్షకులకు రక్షణ' అనే అంశంపై ప్రసంగించారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సమక్షంలో నిర్వహించిన ఈ భేటీకి జైశంకర్ అధ్యక్షత వహించారు. 1948 నుంచి మొదలుకొని ఇప్పటివరకూ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ తరఫున ఐరాసకు ఇప్పటివరకూ 49 మిషన్ల కోసం 2.5 లక్షల ట్రూపులను పంపినట్లు పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షకులకు భద్రత కల్పించడానికి మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన భద్రత వ్యవస్థను ఆయన ప్రతిపాదించారు. ''సమాచార సేకరణ, వినియోగం, విశ్లేషణ, పంపిణీకి అత్యంత విశ్వసనీయమైన విధానాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా శాంతి పరిరక్షణ ప్రక్రియకు ఆరంభం నుంచే ప్రయోజనం కలుగుతుంది. ఘర్షణ ప్రాంతాల కచ్చితమైన గుర్తింపు, అక్కడి పరిస్థితుల ప్రత్యక్ష విశ్లేషణ నిఘా వ్యవస్థకు అత్యంత కీలకం. దీనివల్ల శాంతి పరిరక్షణ సిబ్బంది భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవచ్చు'' అని జైశంకర్ చెప్పారు.
‘యునైట్ అవేర్’కు భారత్ రూపకల్పన
శాంతి పరిరక్షణ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితులను విశ్లేషిస్తూ సమన్వయం చేసుకోవడానికి వీలుకల్పించేలా ఓ కొత్త సాంకేతికతకు భారత్ రూపకల్పన చేసింది. ‘యునైట్ అవేర్’ పేరుతో రూపొందించిన ఈ పరిజ్ఞానానికి ఐరాస సహకారం అందించింది. దీనికోసం భారత్ 16.4 లక్షల డాలర్లను వెచ్చించింది. అంతకు ముందు భారత్, ఐరాసల మధ్య సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం గురించి ఒప్పందం కుదిరింది.
రెండు పత్రాలకు ఏకగ్రీవ ఆమోదం
భారత్ అధ్యక్షతన ఐరాస భద్రత మండలి శాంతి పరిరక్షణకు సంబంధించి రెండు కీలక పత్రాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాస శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు బాధ్యులను గుర్తించేందుకుగానూ 'అకౌంటబిలిటీ ఆఫ్ క్రైమ్స్ ఎగైన్స్ట్ యూఎన్ పీస్‌కీపర్స్' అనే పత్రానికి భారత్ రూపకల్పన చేసింది. దీనికి భద్రత మండలిలోని అన్ని సభ్య దేశాలతో పాటు 80కి పైగా ఐరాస సభ్య దేశాలు సహకారం అందించాయి. శాంతి భద్రతల సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం మద్దతునివ్వాలని ఇందులో ప్రతిపాదించారు. శాంతి పరిరక్షణకు సాంకేతికత అవసరమంటూ భద్రత మండలి అధ్యక్షుడిగా జైశంకర్ చేసిన ప్రకటనతో కూడిన 'టెక్నాలజీ ఫర్ పీస్‌కీపింగ్' పత్రానికీ భద్రత మండలి ఆమోదం తెలిపింది. భద్రత మండలికి సంబంధించి ఈ తరహా పత్రాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. శాంతి పరిరక్షణలో అసువులు బాసిన ఐరాస కార్యకర్తల స్మృతి చిహ్నం వద్ద జైశంకర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
భారత పౌరులను తరలించడంపైనే దృష్టి: జైశంకర్
అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తునట్లు జైశంకర్ పేర్కొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను సురక్షితంగా తరలించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు చెప్పారు. భద్రత మండలి సమావేశం తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అంతకు ముందు అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులపై ఆంటోనియో గుటెరస్‌తో జైశంకర్ చర్చించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో గుటెరస్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఉత్తర ఐరోపా దేశం ఈస్టోనియా విదేశాంగ మంత్రి ఇవా-మారియాతోనూ జైశంకర్ సమావేశమై అఫ్గాన్ పరిణామాలను చర్చించారు.
చర్చల్లో కీలక భూమిక బరాదర్‌దే!
కాబుల్: అఫ్గాన్ ప్రభుత్వ అధికారులతో జరిపే చర్చల్లో తాలిబన్ల అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌దే కీలక పాత్ర కావచ్చని భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పోరాడడంలోనే కాకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోవడంలోనూ ఈ నేతది ముఖ్య భూమిక. గతంలో అధికారంలోకి వచ్చిన రోజులతో పోలిస్తే తామెంతో మారామనీ, 'సమ్మిళిత, ఇస్లామిక్ ప్రభుత్వం' ఏర్పాటును తాము కోరుకుంటున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముల్లాపైనే అందరి దృష్టి పడింది. తాలిబన్ కమాండర్ ముల్లా మహమ్మద్ ఒమర్ సజీవంగా ఉన్నప్పుడు డిప్యూటీలుగా వ్యక్తిగతంగా నియమించుకున్నవారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది బరాదర్ మాత్రమే. ఇప్పటి సర్వోన్నత నేత మౌలావీ హిబాతుల్లా అఖ్తుంజాదా కంటే ఎక్కువగా బయటకు కనిపించేది ముల్లా బరాదరే. మంగళవారం కాందహార్‌కు చేరుకున్న ఈ నేతకు పెద్దఎత్తున స్వాగతం లభించింది.