అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వీటికి తోడు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో హ్యూస్టన్ నగర పోలీస్ విభాగం సారథి... ట్రంప్‌పై బహిరంగంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్.. తన మాటలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
"అమెరికా పోలీసు అధికారుల తరఫున అధ్యక్షుడికి నేను ఒక మాట చెప్తున్నా. ట్రంప్.. మీ దగ్గర చెప్పడానికి నిర్మాణాత్మకంగా ఏమీ లేకపోతే.. మీ మాట్లాడడం ఆపండి."
-- ఆర్ట్ అసివిడో, హ్యూస్టన్ పోలీస్ చీఫ్.
అమెరికావ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనలకు కారణం బలహీనులైన గవర్నర్లని.. ఆందోళలను అదుపుచేయడానికి తాను వేలాది మంది సాయుధ బలగాలను రంగంలోకి దించుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అసివిడో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించకూడదని, ప్రజల మనసులను గెలుచుకోవాలని హితవు పలికారు.