కరోనా కట్టడికి అమెరికా వైద్యుల కొత్త టెక్నిక్! - కరోనా వ్యాక్సిన్ ఉందా
ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో నిమగ్నమైతే అమెరికా మాత్రం సరికొత్త విధానాన్ని అమలు చేసింది. ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని వైరస్‌తో బాధపడుతున్న మరొక వ్యక్తికి ఎక్కించారు వైద్యులు. వైరస్‌ను నిర్మూలించేలా ఈ విధానం పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే అందరికీ ఈ విధానాన్నే అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
![కరోనా కట్టడికి అమెరికా వైద్యుల కొత్త టెక్నిక్! Houston hospital first in US to try coronavirus blood transfusion therapy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6588223-thumbnail-3x2-rk.jpg?imwidth=3840)
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా బలి తీసుకుంది. మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు కుస్తీలు పడుతున్నారు. అయితే అగ్రరాజ్యం మాత్రం సరికొత్త విధానాన్ని పరీక్షిస్తోంది. వైరస్ కారణంగా పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి.. మహమ్మారి నుంచి కొలుకున్న వేరే వ్యక్తి రక్తాన్ని ఎక్కించారు. ఇలాంటి విధానాన్ని ఇక్కడ మొట్టమొదటి సారిగా ప్రయోగించినట్లు వైద్యులు తెలిపారు.
వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని రెండు వారాలకుపైగా అవుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి తన ప్లాస్మాను దానం చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అమెరికాలో మొత్తం 2000 మందికిపైగా మరణించిన నేపథ్యంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
''ప్లాస్మా మార్పిడి విధానం చాలా వినూత్నమైనది. ఈ విధానం ఇంకా పరిశీలనలోనే ఉన్నందున అనేక మందికి ఈ విధానాన్ని ఉపయోగించటానికి ఇంకా సమయం పడుతుంది.''
-డాక్టర్ ఎరిక్ సాలజర్, మెథడిస్ట్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఫిజీషియన్ సైంటిస్ట్.
కోలుకునే అవకాశం ఎక్కువ..
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ప్లాస్మాను రోగికి అందించటం ద్వారా నిరోధక శక్తి పెరిగి వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అతడి ప్రాణాలను కాపాడటం సులభమని వైద్యులు పేర్కొంటున్నారు.
మొత్తం వైరస్ బారిన పడి కోలుకున్న 250 మంది నుంచి ప్లాస్మా సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమైతే మాత్రం అందుబాటులో ఉన్న బ్లడ్ సెంటర్ నుంచి, ఇతర అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి రక్తాన్ని సేకరించి ప్రజలకు రక్త మార్పిడి చేయనున్నట్లు మెథడిస్ట్ రీసర్చ్ సీఈఓ మార్క్ బూమ్ వెల్లడించారు. ఈ విధానాన్ని అమలు చేయటం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ రావాలంటే...
వ్యాక్సిన్ కోసం ప్రపంచ శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నా... అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా 12-18 నెలల పట్టే అవకాశాలున్నాయి. ఇతర మందులు పరిశీలిస్తున్నా.. అవి క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉన్నాయి. పూర్తి ఫలితం తెలియడానికి.. 8 నుంచి 10 నెలలు పట్టే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
1918లో మొట్టమొదటి సారిగా..
ఈ విధానాన్ని 1918లో స్పానిష్ ప్లూ సంక్రమించిన సమయంలో, 1920 డిఫ్తీరియా వ్యాధి ప్రబలినప్పుడు, 1930లో ఫ్లెష్ - ఈటింగ్ బ్యాక్టీరియా వ్యాధి సోకినప్పుడు, ఇతర అంటు వ్యాధుల సమయంలో ఈ తరహా ఫ్లాస్మా మార్పిడి విధానాన్ని ఉపయోగించారు.