అమెరికా టెక్సాస్‌లో హ్యూస్టన్ వేదికగా భారతీయ అమెరికన్లు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి తపాను ముప్పు పొంచి ఉంది. సుమారు 50 వేల మంది భారతీయ అమెరికన్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదిక పంచుకోనున్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇమెల్డా తుపాను విరుచుకుపడింది. దీని ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. హ్యూస్టన్ నగరంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల వరకు తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ టెక్సాస్‌లోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
నిర్వాహకుల్లో ఆందోళన...
భారీ వర్షాలతో 'హౌదీ-మోదీ' కార్యక్రమం నిర్వాహకుల్లో ఆందోళన పెరిగింది. కానీ తుపాను ముప్పు ఉన్నప్పటికీ సభను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హ్యూస్టన్‌లోని విశాలమైన ఎన్ఆర్జీ మైదానానికి హాజరయ్యే వారందరికీ వారి జీవితమంతా ఎంతో ఆనందాన్ని ఇచ్చే అనుభవం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
1500 మంది వాలంటీర్లు...
ఆదివారం జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం సుమారు 1500 మంది వాలంటీర్లు 24 గంటలు కష్టపడుతున్నారు. ఈ సమావేశం ద్వారా హ్యూస్టన్, అమెరికాలో భారతీయ-అమెరికన్ల సంఖ్యలో పెరుగుతున్న పరిమాణం, శక్తిని ప్రతిబింబించనుంది.
ప్రముఖుల హాజరు...
హౌదీ-మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు హాజరవుతున్నారు. సమావేశంలో భాగంగా భారత ప్రధాని మోదీతో పాటు వారంతా సమావేశమవుతారు.
ఇదీ చూడండి: ఆసియా దేశాల సైనిక విన్యాసాలు అదరహో..!