పూర్తిగా టీకా తీసుకున్న అమెరికన్లు మాస్కు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా ఇంటి లోపల కలుసుకోవచ్చని ఫెడరల్ వైద్యారోగ్య అధికారులు తెలిపారు. ఒకే ఇంట్లో వ్యాక్సిన్ వేయించుకున్నవారు సాధారణంగా గడపవచ్చని వెల్లడించారు. టీకా పొందిన వృద్ధులు మాస్కు లేకుండా చిన్న పిల్లలను కలవచ్చని వివరించారు. ఈ మేరకు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) సోమవారం పలు మార్గదర్శకాలను జారీచేసింది.
అనుమానాలకు తెర..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ వాళ్లను మహమ్మారి ముందు నాటి తరహాలో కలుసుకునేందుకు వీలు పడుతుందా అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. అయితే ఏడాదిగా కొవిడ్ ఆంక్షలతో విసుగుచెందిన అమెరికన్లకు ఈ సూచనలు ఉపశమనం కలిగించనున్నాయని సీడీసీ మాజీ డైరెక్టర్ డా.రిచర్డ్ బెసర్ అన్నారు.
రోజురోజుకూ మరింత మంది టీకా పొందుతుండటం వల్ల సాధారణ పరిస్థితులను పునరుద్ధరించటంలో ముందడుగు వేస్తున్నామని సీడీసీ డైరెక్టర్ డా. రోషెల్లే వాలెన్స్కీ చెప్పారు. వైరస్ కేసులు, మరణాలు తగ్గుతున్న కొద్దీ మరిన్ని పనులు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం కలగనుందని వివరించారు.
'మాస్కు కొనసాగించాలి'
అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కులు ధరించటం, పెద్ద సమావేశాలకు దూరంగా ఉండటం, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం లాంటివి కొనసాగించాలని సీడీసీ సూచిస్తోంది.
ఇప్పటివరకు అమెరికాలో 3.1కోట్ల మంది (జనాభాలో 9%) టీకా పొందారు. తాజా మార్గదర్శకాలు మరింత మంది వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సాహిస్తాయని బెసర్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: 'హెచ్4 వీసాల జారీలో తీవ్ర జాప్యం'