అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తర కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలు నివాస ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్లుమాస్, లాసెన్ సియెర్రా కౌంటీ ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
వేడిని తట్టుకోలేక..
మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. కానీ పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటల వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అగ్నిమాపక బృందాల సహాయం కోరారు అధికారులు. ఈ మేరకు భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలల వీడియోను ట్వీట్ చేసింది అగ్నిమాపక విభాగం.
అధిక ఉష్ణగ్రతలే కారణం!
వాషో కౌంటీకు తూర్పున మూడు మైళ్ల దూరంలో కొండపై ఉన్న ఇళ్లు ప్రమాదంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. మరోవైపు పక్కనే ఉన్న రహదారిపైకి దావానలం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ని జ్వాలలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు, పవనాలు వీయడం వల్ల దావానలం మరింత ఉద్ధృతంగా మారుతోంది. ఇప్పటికే 80 చదరపు కిలో మీటర్లు మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది.
ఇదీ చూడండి: ముళ్లబాటలో ట్రంప్.. సర్వేల్లో సంకేతాలు సుస్పష్టం