కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. అంతేనా.. మాస్క్ ధరించపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే, ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే నిబంధన అమలు చేస్తోంది. రెస్టారెంట్లోకి మాస్క్ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్క్‌లు ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్‌లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్ తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు చొప్పున బాగానే వసూలవుతున్నాయి.
అయితే, ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి : టీకా తీసుకున్నాక సుస్తీ చేస్తే కొవిడ్ పరీక్ష చేసుకోవాలా?