అమెరికాలో ఓ పోలీసు చేతిలో మరణించిన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు. అంతకుముందే అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్.. ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.
అయితే అంత్యక్రియలకు హాజరు కావటం లేదని బిడెన్ సహాయకుడు తెలిపారు. ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసి సానుభూతి ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిడెన్ వీడియో సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
అంత్యక్రియలు..
అంత్యక్రియల నిమిత్తం ఫ్లాయిడ్ భౌతికకాయాన్ని హ్యూస్టన్‌కు శనివారం తీసుకొచ్చారు. ఫ్లాయిడ్ అంత్యక్రియలను హ్యూస్టన్ శివారులోని పియర్లాండ్‌లో మంగళవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు.
జార్జి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతించనున్నారు అధికారులు. ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు వచ్చేవారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. అయితే కొవిడ్- 19 నిబంధనల ప్రకారం సందర్శనకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నట్లు మేయర్ సిల్వస్టర్ స్పష్టం చేశారు.
ఫ్లాయిడ్ హత్య..
ఓ ఫోర్జరీ కేసులో మే 25న అరెస్టు చేసిన మిన్నియాపోలిస్ పోలీసులు ఫ్లాయిడ్‌పై కఠినంగా వ్యవహరించారు. మెడపై మోకాలితో తొక్కిపట్టి ఊపిరాడకుండా చేశారు. శ్వాస అందని కారణంగా ఫ్లాయిడ్ మరణించారు. ఫ్లాయిడ్ మృతితో అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.
ఇదీ చూడండిె: హ్యూస్టన్‌కు చేరుకున్న ఫ్లాయిడ్ పార్థివదేహం