ప్రపంచ దేశాలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 3న 'ఎలక్షన్ డే' కోసం అమెరికా సిద్ధమవుతోంది. ఇంతకీ... ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా సాగుతుంది? ప్రపంచాన్ని శాసించే 'విజేత'ను ఎప్పుడు ప్రకటిస్తారు?
పరోక్ష ఎన్నిక...
ఓట్ల లెక్కింపునకు ముందు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయి. అంటే.. ప్రజలు ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. ఎన్నికల కోసం ఆయా పార్టీలు నియమించిన ఎలక్టార్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన అనంతరం వీళ్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 మంది ఎలక్టార్లు ఉంటారు. 270 అంతకన్నా ఎక్కువ మంది ఎలక్టార్లను గెల్చుకున్న పార్టీ అభ్యర్థే అధ్యక్షుడవుతారు.
ఓటింగ్ ఇలా...
భారత్‌లో ప్రజలు ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ అగ్రరాజ్య ప్రజలు ఓటు వేసేందుకు సహజంగా రెండు విధానాలుంటాయి.
- ఎన్నికల రోజు ఓటింగ్
- ముందస్తు పోలింగ్
ఎన్నికల రోజు.. అంటే నవంబర్ 3న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!
ముందస్తు పోలింగ్‌లోనూ రెండు విధానాలు ఉంటాయి.
- మెయిల్ ఇన్ బ్యాలెట్ (పోస్టల్ బ్యాలెట్)
- ముందుగానే పోలింగ్ కేంద్రాలను తెరవడం
మెయిల్ ఇన్ బ్యాలెట్ అంటే.. ప్రజలు తమ ఓట్లను ఓ ఎన్వలప్లో పెట్టి పంపిస్తారు. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత కొన్ని వారాల పాటు కూడా ఈ మెయిల్ ఇన్ పోస్ట్‌లను స్వీకరిస్తాయి. అయితే ఇక్కడ ఓ షరతు ఉంది. ఆ పోస్ట్‌ల మీద ఎన్నికల తేదీ ఉంటేనే వీటిని పరిగణిస్తారు.
ఇదీ చూడండి:- ఈ రాష్ట్రాలు ఎటువైపు 'స్వింగ్' అవుతాయి?
మరోవైపు ఎన్నికల రోజు ముందే.. ముందస్తు పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సహజం ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు నెలల ముందు నుంచే పోలింగ్ కేంద్రాలను తెరిస్తే... మరికొన్ని ఎన్నికల ముందు తెరుస్తాయి.
ఎలా లెక్కిస్తారు?
అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఎంత సంక్లిష్టమో.. ఓట్ల లెక్కింపు కూడా అంతే క్లిష్టం. ఈ ప్రక్రియ సహజంగా చాలా రోజులు పడుతుంది. అయితే.. ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే విజేత ఎవరనేది ఓ స్పష్టత వస్తుంది.
మెయిల్- ఇన్ ఓట్ల లెక్కింపు...
మెయిల్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించేందుకు చాలా సమయం పడుతుంది. ప్రతి ఓటు మీద ఓటరు సంతకం ఉండాలి. రిజిస్ట్రేషన్ కార్డులో ఉన్న సంతకంతో ఇది పోలి ఉండాలి. ఇవన్నీ చూసేసరికి ఆలస్యమవుతుంది.
ఇదీ చూడండి:- బైడెన్‌కు భారీగా పడనున్న ఆసియా- అమెరికన్ల ఓట్లు!
అదే సమయంలో అగ్రరాజ్యంలో ఉన్న 50 రాష్ట్రాలు.. మెయిల్-ఇన్ ఓట్లను లెక్కించేందుకు ఒక్కో పద్ధతిని అనుసరిస్తాయి.
అయితే.. అగ్రరాజ్య చరిత్రలో ఎన్నిడూ లేని విధంగా ఈసారి ప్రజలు ముందస్తు పోలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. కరోనా వైరస్ ఇందుకు ముఖ్య కారణం. దీంతో ఫలితాలు మరింత ఆలస్యంగా వెలువడే అవకాశాలూ లేకపోలేదు.
'పోలింగ్' ఓట్ల లెక్కింపు...
పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు పలు విధానాలు ఉంటాయి.
- ఎలక్ట్రానిక్
- పేపర్ బ్యాలెట్
ఎన్నికల రోజు.. అంటే నవంబర్ 3న ఎన్నికల సమయం ముగిసిన వెంటనే.. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సిబ్బంది భద్రంగా సీల్ చేస్తారు. అక్కడి నుంచి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కేంద్రానికి(సెంట్రల్ ఓట్ కౌంటింగ్ ఫెసిలిటీ) తరలిస్తారు. ఇదొక ప్రభుత్వం కార్యాలయం. ఇక్కడ ఓట్లను లెక్కిస్తారు.
పేపర్ బ్యాలెట్లను అధికారులు బయటకు చదువుతారు. చివరకు అన్నీ కలిపి లెక్కపెడతారు. కచ్చితత్వం కోసం ఇద్దరు అధికారులు ఓట్లను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ తరహా పద్ధతిలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఓటు ఏ అభ్యర్థికి వేశారనేది స్పష్టంగా ఉండదు. ఈ నేపథ్యంలో ఆ ఓటును లెక్కించాలా? వద్దా? అన్నది అధికారుల నిర్ణయం.
అయితే పోలింగ్ ముగింపు సమయం.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది.
ఇదీ చూడండి:- 'ఓట్లేయండి బాబు'.. అంటున్న ట్రంప్- బైడెన్
రీకౌంటింగ్ సంగతేంటి?
ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నా.. ఓటింగ్ పరికరంలో ఏదైనా సమస్య తలెత్తినా.. రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసే అవకాశం అభ్యర్థులకు ఉంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా రీకౌంటింగ్ నిర్వహించాలని పలు రాష్ట్రాలు చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈసారి మరింత ఆలస్యం?
సహజంగానే సంక్లిష్టంగా ఉండే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈసారి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిల్-ఇన్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా... అధ్యక్ష ఎన్నికల విజేతను తెలుసుకోవాలంటే ప్రజలు వారాల పాటు ఎదురుచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు ట్రంప్. లెక్కింపు ప్రక్రియలో దుష్పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందన్నారు.
ఈ పూర్తి వ్యవహారంపై రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కోర్టు మెట్లు ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఇప్పటికే దేశంలో అత్యున్నత న్యాయవాదులను నియమించుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:- అన్నింటా బద్ధవైరం.. ఇద్దరూ మందుకు దూరం!