ఎప్పటికప్పుడు సరికొత్త అంతరిక్ష ప్రయోగాలతో అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'... ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశాన్ని కనుగొంది. బెన్ను గ్రహం లక్ష్యంగా పంపిన అంతరిక్ష నౌక 'ఓసిరిస్ ఆర్ఎక్స్' OSIRIS-REx(ఆరిజిన్స్, స్పెక్రల్ ఇంటర్‌ప్రెటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ- రీగోలిత్ ఎక్స్‌ప్లోరర్) సాయంతో బెన్నుపై నీటి జాడని కనుగొంది నాసా. గతేడాది డిసెంబర్ 31న ఓరిసిస్ ఆర్ఎక్స్ బెన్ను కక్ష్యలో పరిభ్రమించటం మొదలుపెట్టింది. బహుశా సౌరవ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఈ ఉల్కపై నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ మేరకు నాసా అధికారిక ప్రకటన విడుదల చేసింది. బెన్ను ఉపరితలం నుంచి పెద్దఎత్తున పొగ ఎగసిపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారని పేర్కొంది. శాస్త్రవేత్తలు ఊహించినదానికంటే బెన్ను ఉపరితలం మరింత కఠినంగా ఉందని తెలిపారు. అందుకే దీనిపై దిగేందుకు అనువైన చోటును గుర్తించలేక పోతున్నామని స్పష్టం చేశారు.
" బెన్ను ఉపరితలంపై పొగను గుర్తించటం నా శాస్త్రీయ వృత్తిలోని అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మేము ఊహించిన దానికంటే బెన్ను భూభాగం మరింత కఠినంగా ఉంది. ఇది మమ్మల్ని అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బెన్నుతో మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది."
-డాంట్ లారెటా, శాస్త్రవేత్త
2023 న తిరిగి భూమిపైకి
ఈ అంతరిక్షనౌక 2023లో తిరిగి భూమిని చేరుతుందని నాసా అధికారులు స్పష్టం చేశారు. గత మూడు నెలల్లో బెన్ను గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న శాస్త్రవేత్తలు వీటిలో కొన్నింటిని మంగళవారం హోస్టన్‌లో జరిగిన 50 వ 'ల్యూనార్ అండ్ ప్లానెటరీ కాన్ఫరెన్స్'లో సమర్పించామని తెలిపారు.